రమణదీక్షితులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ..?     2018-06-06   01:03:44  IST  Bhanu C

అటు టీటీడీకి ఇటు టీడీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మాజీ టీటీడీ ప్రధానార్చకులు రమణదీక్షితులు రాజకీయాల్లోకి అదునుపెట్టబోతున్నారా ..? అందుకే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోపాటు రాజకీయనాయకులవలె సవాల్ విసురుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడా అనే అనుమానాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఆయన్ను ఎదో ఒక రాజకీయ పార్టీ వెనుక ఉంది నడిపిస్తోందన్న అనుమానాల్లోంచి ఆయనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు అనే స్థాయికి ఆయన వ్యవహారం వెళ్లిపోయింది.

తన రాజకీయ అడ్డాగా టీటీడీ ని మార్చుకుని తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. అంతేకాకుండా ఈ వివాదం మరింత ముదిరి బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ద్వారా సుప్రీం కోర్టులో కూడా అడుగెట్టబోతోంది. అంతేకాదు టీటీడీ మీద ప్రభుత్వ పెత్తనానికి ముగింపుపలికే దిశగా వ్యవహారం వెళ్ళింది. టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన రమణ దీక్షితులు సహజంగానే ప్రతిపక్ష వైసీపీకి ఆప్తమిత్రులయ్యారు.

“నామీద ఆరోపణలు చేసేవాళ్ళందరూ వాళ్ళవాళ్ళ ఆస్తుల మీద సీబీఐ దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నారా.. నన్ను ఎలిమినేట్ చేసే కుట్రలు జరుగుతున్నాయి.. నాకు ప్రాణహాని వుంది..” లాంటి ఆరోపణల్లో పక్కా రాజకీయ వాసనలు ఉండడంతో.. ఆయన క్రమంగా రాజకీయ నాయకుడిలా మారుతున్నాడు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.