తండ్రితో బిజినెస్‌కు చరణ్‌ మాస్టర్‌ ప్లాన్‌!     2018-06-15   00:32:04  IST  Raghu V

ఈమద్య కాలంలో హీరోల పారితోషికాలు అమాంతం పెరిగాయి. ముఖ్యంగా చరణ్‌, మహేష్‌, ఎన్టీఆర్‌ వంటి యువ స్టార్‌ హీరోల పారితోషికాలు భారీ ఎత్తున పెరగడంతో నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. అయితే సీనియర్‌ స్టార్‌ హీరోలకు మాత్రం పెద్దగా పారితోషికం దక్కడం లేదు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు అయిదు కోట్లు ఆలోపు పారితోషికాలు మాత్రమే అందుకుంటున్నారు. సీనియర్‌ స్టార్‌ హీరో అయిన చిరంజీవి ఈమద్యే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈయన పారితోషికం కూడా బాలయ్య, నాగ్‌ల స్థాయిలోనే ఉంటుందని అంతా భావించారు. అయితే చరణ్‌ తన తండ్రి సినిమాలతో మంచి బిజినెస్‌ చేస్తూ భారీలా లాభాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం.150’ చిత్రంతో నిర్మాతగా మారిన రామ్‌ చరణ్‌ ఆ తర్వాత వరుసగా సినిమాలు నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రంను చరణ్‌ తన కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఆ చిత్రంపై చరణ్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయల లాభంను ఆ సినిమా నుండి వస్తుందనే నమ్మకంతో చరణ్‌ ఉన్నాడు. ఇక ఆ తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమాను కూడా చరణ్‌ నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాడు.