ఇంత అవినీతి నీకు కనిపించడం లేదా?     2018-04-30   05:15:41  IST  Raghu V

సినిమా పరిశ్రమలో అవినీతి లేదని, అన్ని రంగాల్లో ఉన్న అవినీతి ఒక్క సినిమా పరిశ్రమలో మాత్రమే లేదు అంటూ రామ్‌ చరణ్‌ తాజాగా ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పై వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యలపై ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. సినిమా పరిశ్రమలో భారీ ఎత్తున అవినీతి ఉంటుందని, ఆ విషయం రామ్‌ చరణ్‌కు తెలియనట్లుందని కొందరు ఎద్దేవ చేస్తున్నారు. సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామని, సహాయ దర్శకులు కొందరిని లంచం తీసుకుని పెద్ద దర్శకులకు పరిచయం చేయడం వంటివి జరుగుతాయి. ఈ విషయం కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అన్ని వర్గాల్లో జరుగుతూనే ఉంటుంది.

ఒక క్యారెక్టర్‌ ఆర్టిస్టు స్టార్‌ హీరో సినిమాలో ఛాన్స్‌ను దక్కించుకోవాలి అంటే ప్రొడక్షన్‌ కంట్రోల్‌ వారిని లేదా సహాయ దర్శకుడిని మెప్పించాల్సి ఉంటుంది. ఆ సమయంలో తమ పారితోషికంలో కాస్త వాటా అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అమ్మాయిలు తమ మానంతో పాటు ఆర్థికంగా కూడా అంతో ఇంతో సమర్పించుకుంటే తప్ప ఆఫర్లు అనేవి రావు అని గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో రామ్‌ చరణ్‌ అవినీతి లేదు అంటూ అంత గట్టిగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కొందరు అంటున్నారు.