బోయపాటికి రామ్‌ చరణ్‌ డెడ్‌లైన్‌     2018-06-30   03:40:28  IST  Raghu V

‘రంగస్థలం’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న రామ్‌ చరణ్‌ ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. యాక్షన్‌ చిత్రాలతో ఆకట్టుకుంటూ దూసుకు పోతున్న దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం చరణ్‌ కోసం భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేసి చిత్రీకరణ జరుపుతున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా ఈ చిత్రం కాస్త ఆలస్యంగా మొదలైంది. దాంతో పాటు మద్యలో షూటింగ్స్‌కు ఆటంకాలు వచ్చాయి. దాంతో సినిమాను దసరాకు అనుకున్నది కాస్త సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. నవంబర్‌ వరకు షూటింగ్‌ జరపాలని దర్శకుడు భావిస్తున్నాడు.

మరో వైపు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోగా రాజమౌళి భారీ మల్టీస్టారర్‌ చిత్రానికి ప్లాన్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం కోసం రామ్‌ చరణ్‌ సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నుండి అందుబాటులో ఉండాల్సి ఉంది. కాని బోయపాటి మ్రాతం నవంబర్‌ చివరి వరకు ప్రస్తుతం చరణ్‌తో చేస్తున్న సినిమాను ప్లాన్‌ చేసుకున్నాడు. బోయపాటి సినిమా కంటే రాజమౌళి సినిమా చరణ్‌కు ఎక్కువ ప్రాముఖ్యత. అందుకే బోయపాటితో చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాల్సిందిగా చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. నవంబర్‌ వరకు అనుకున్న సినిమాను అక్టోబర్‌ రెండవ లేదా మూడవ వారంలో పూర్తి అయ్యేలా వరుసగా షెడ్యూల్స్‌ను ప్లాన్‌ చేయాల్సిందిగా చరణ్‌ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.