చరణ్‌, బోయపాటిల మూవీకి ‘ఇంద్ర’తో సంబంధం ఏంటి?     2018-05-16   00:35:28  IST  Raghu V

‘రంగస్థలం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తర్వాత రామ్‌ చరణ్‌ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉంటాయి. ప్రతి సినిమాను ముందు సినిమా కంటే బాగా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. అలాగే రంగస్థలం కంటే బెటర్‌ మూవీని చేయాలని రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆశపడుతున్నాడు. తన ఆశను ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బోయపాటి శ్రీనుకు చెబుతున్నాడు. యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ వంటి దర్శకుడు బోయపాటి. ఈయన దర్శకత్వంలో చరణ్‌ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి కెరీర్‌లో బెస్ట్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచే ‘ఇంద్ర’ సినిమాకు ఈ సినిమాకు కాస్త సారుప్యత ఉందని, ఆ సినిమాలో మాదిరిగా ఈ చిత్రంలో కూడా ఒక పవర్‌ ఫుల్‌ ఫ్ల్యాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ను దర్శకుడు బోయపాటి ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో మొదట రామ్‌ చరణ్‌ ఒక సాదారణ యువకుడిగా కనిపిస్తాడు. నలుగురిలో కలిసి పోయి తన వారితో జీవితాన్ని హాయిగా కొనసాగిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో కొందరు తారస పడటంతో ఆయన గత కథ తెలుస్తుంది. రాజవంశస్తుడు అయ్యి ఉండి, వేల కోట్లకు వారసుడు అయిన రామ్‌ చరణ్‌ అలా సాదారణంగా జీవించడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అనేదే కథ.