దిల్‌రాజు ప్రయోగానికి రాజ్‌ తరుణ బలి  

తెలుగు సినిమా పరిశ్రమలో దిల్‌రాజుకు నిర్మాతగా మంచి పేరు ఉంది. ఈయన సినిమాలను ఎలా నిర్మించాలి, వాటిని ఎలా విడుదల చేయాలి అనే విషయంలో మంచి అవగాహణ ఉంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దిల్‌రాజు టేకోవర్‌ చేసిన దాదాపు ఎక్కువ శాతం చిత్రాలు విజయాన్ని దక్కించుకున్నాయి. తాజాగా దిల్‌రాజు బ్యానర్‌ నుండి వచ్చిన ‘లవర్‌’ చిత్రం కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అయ్యింది. రాజ్‌ తరుణ్‌కు ఈ చిత్రం బూస్ట్‌ ఇస్తుందని, మరి కొన్ని సినిమాలకు ఆయనకు ఈ చిత్రం దారి చూపుతుందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాజ్‌ తరుణ్‌ మార్కెట్‌ ఈమద్య దారుణంగా పడిపోయింది. అయినా కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఈ చిత్రాన్ని దాదాపు 8 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక సినిమా ప్రమోషన్స్‌ విషయంలో నిర్మాత దిల్‌రాజు ప్రయోగాత్మకంగా వ్యవహరించాడు. సినిమాపై మొదటి నుండే దిల్‌రాజుకు కాస్త అనుమానం ఉంది. దాంతో చిత్రంకు భారీ హైప్‌ తీసుకు వచ్చి, ఆ తర్వాత సినిమా యావరేజ్‌గా ఉంటే మాత్రం ప్రేక్షకులు నిరాశ పడతారు. అందుక సినిమాకు పబ్లిసిటీ తక్కువ చేస్తే సినిమా యావరేజ్‌గా ఉన్నా కూడా మంచి ఫలితం దక్కుతుందని నిర్మాత దిల్‌రాజు ప్లాన్‌ చేశాడు.

‘లవర్‌’ చిత్రానికి దిల్‌రాజు ఆ కారణంగానే భారీ పబ్లిసిటీ చేయలేదు. తక్కువ పబ్లిసిటీతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ‘లవర్‌’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నమోదు కాలేదు. దాంతో సినిమా మామూలుగా ఉన్నా కూడా తప్పకుండా ఆధరిస్తారు అని దిల్‌రాజు అండ్‌ కో అనుకున్నారు. కాని ఫలితం తారు మారు అయ్యింది. సినిమా ఫలితం బెడిసి కొట్టింది. మామూలుగా కాదుగా, కనీసం చూసే విధంగా కూడా సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.

పబ్లిసిటీ ఎక్కువ చేసినా ఓపెనింగ్స్‌ అయినా బాగా వచ్చేవి. కాని ఇప్పుడు 8 కోట్ల మూవీకి కేవలం కోటి రూపాయల షేర్‌ కూడా వచ్చే పరిస్థితి లేదు అంటూ డిస్ట్రిబ్యూటర్లు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఏమాత్రం దిల్‌రాజు ప్రమోషన్స్‌ చేసినా కూడా మంచి ఫలితం ఉండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ ఫలితంతో రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ మరింత కష్టాల్లో కూరుకు పోయింది. ఈయనతో సినిమాలను నిర్మించేందుకు నిర్మాతలు, దర్శకులు ఇప్పుడు ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.