రాహుల్ ఇరకాటంలో పడ్డాడా..? టి.కాంగ్రెస్ రాజకీయాలు అర్ధంకావడంలేదా ..?     2018-06-19   03:45:10  IST  Bhanu C

దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తుండడంతో కాంగ్రెస్ లో కొత్త ఆశల చిగురులు పుట్టుకొస్తున్నాయి. ఏదోవిధంగా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ రధసారధి రాహుల్ రంగంలోకి దిగి అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ను బలోపేతం చేసే పనిలో పడ్డాడు. అయితే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు రాహుల్ కి ఏమాత్రం అర్ధంకాకపోగా .. అక్కడ నాయకుల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరుతో పార్టీ పరిస్థితి దిగజారుతుండడంతో రాహుల్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలో పార్టీ ప్రక్షాళన ఎలా చేయాలో తెలియక ఆయన తికమకపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఆరు నెలల నుంచి టీ కాంగ్రెస్ పునర్ వ్యవస్థీకరణ వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడమే దీనికి నిదర్శనం.

రాహుల్ ను అంతగా ఇబ్బందిపెడుతున్న అంశాలు చాలానే ఉన్నాయట. ఇందులో ముఖ్యంగా టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రే కీలకంగా కనిపిస్తోంది. అదృష్టం కలిసి వస్తే 2019లో ముఖ్యమంత్రి అయిపోవాలని ఉత్తమ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మిగతా కాంగ్రెస్ నాయకులతో వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ లో కాకలు పుట్టిస్తోంది. దాదాపు ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.