చిన్న హీరో జారి పోయిన టాప్‌ హీరో చిక్కాడు

విభిన్న చిత్రాల దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్న ప్రవీణ్‌ సత్తారు ఆ మద్య జాతీయ అవార్డును సైతం దక్కించుకున్నాడు. జీవితాలను చూపిస్తాడు అంటూ ఈయనకు పేరుంది. తాజాగా ఈయన కమర్షియల్‌ చిత్రం ‘గరుడవేగ’తో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. అందుకే ఈయన అవార్డు చిత్రాలకు మాత్రమే కాదు, కమర్షియల చిత్రాలకు కూడా దర్శకత్వం వహించగలడు అనే నమ్మకం సినీ హీరోల్లో వ్యక్తం అయ్యింది. అందుకే ఈయనతో యువ హీరో రామ్‌ ఒక సినిమాను చేసేందుకు ముందుకు వచ్చాడు. వీరిద్దరి కాంబోలో మూవీకి అంతా సిద్దం అయ్యింది. సినిమా సెట్స్‌ పైకి వెళ్లబోతుందని భావిస్తున్న సమయంలోనే అందరికి షాక్‌ ఇస్తూ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

ప్రవీణ్‌ సత్తారు మూవీని ఎట్టి పరిస్థితుల్లో లో బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ఆసక్తిని కనబర్చడు. గరుడవేగ చిత్రాన్ని ఏకంగా 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన విషయం తెల్సిందే. రామ్‌తో సినిమాకు కూడా భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేశాడు. దాంతో నిర్మాత స్రవంతి రవికిషోర్‌ అంత బడ్జెట్‌ తన వల్ల కాదని, 25 కోట్లకు లోపు బడ్జెట్‌తో అయితే చేద్దాం అంటూ సూచించడంతో దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు సినిమాను తాను చేయను అంటూ తేల్చి చెప్పాడు. దాంతో రామ్‌ మరో సినిమాను చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ఏంటా అంటూ అందరిలో చర్చ జరుగుతుంది.