‘సాహో’ సాహసం.. బూడిదలో పోసిన పన్నీరు!     2018-05-02   22:47:07  IST  Bhanu C

‘బాహుబలి’తో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. అంతకు ముందు వరకు 50 కోట్ల బడ్జెట్‌ అంటే బాబోయ్‌ అనే వారు, కాని ఇప్పుడు వందల కోట్లు బడ్జెట్‌ పెట్టి సినిమాలు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సినిమాలో మ్యాటర్‌ ఉంటే ఎంత బడ్జెట్‌ అయినా రికవరీ చేస్తుందనే విషయం బాహుబలితో రుజువు అయ్యింది. అయితే అనాలోచితంగా ఎక్కువ బడ్జెట్‌ పెడితే కొన్ని సార్లు కష్టం అవుతుందనే విషయాన్ని కొందరు గుర్తించడం లేదు. బాహుబలి సినిమా కోసం జక్కన్న ఒక అద్బుతాన్ని సృష్టించాడు కనుక అది ఆ రేంజ్‌లో కలెక్షన్స్‌ను వసూళ్లు చేసింది. అన్ని సినిమాలు కూడా అదే స్థాయిలో వసూళ్లు సాధిస్తాయనే నమ్మకం లేదు.

స్టార్‌డం మరియు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని చిత్ర బడ్జెట్‌ను కేటాయించుకోవాల్సి ఉంటుంది. కాని ‘సాహో’ చిత్రానికి అవేవి ఆలోచించకుండా బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కొత్త దర్శకుడు సుజీత్‌ను నమ్మి యూవీ క్రియేషన్స్‌ వారు ఏకంగా 250 కోట్లను ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఒక ఖరీదైన యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించాడు. రెండు నెలల పాటు చిత్రీకరించిన ఆ యాక్షన్‌ సీన్స్‌కు ఏకంగా 90 కోట్లను ఖర్చు చేసినట్లుగా స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఎంత భారీ సినిమా అయితే మాత్రం ఒక యాక్షన్‌ సీన్‌కు అంతగా ఖర్చు చేయడం ఏంటని బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.