దిల్ రాజుపై పోలీసు కేసు నమోదు .. కొత్త వివాదం తెరపైకి     2017-09-17   01:17:09  IST  Raghu V

అగ్ర నిర్మాత, పంపిణీదారుడు దిల్ రాజు మీద నిన్న హైదరాబాదులోనే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్కయింది. ‌ రాజుతో పాటు దర్శకుడు దశరథ్ పేరుకూడా కేసులో నమోదవడం గమనార్హం. వీరిద్దరి కాంబినేషన్లో ప్రభాస్ హీరోగా 2011వ సంవత్సరంలో మిస్టర్ పెర్ఫెక్ట్ అనే సినిమా వచ్చింది. కాజల్, తాప్సి, కథానాయికలుగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇన్నేళ్లకు ఈ సినిమా కథను కాజేశారని కేసు నమోదవడం ఆశ్చర్యకరం.

శ్యామల రాణి అనే రచయిత్రి నా మనసు కోరింది నిన్నే అనే నవల రచించారు ‌. ఈ నవల నుంచే చిత్రం యొక్క మూలకథను దొంగిలించారని, అలాగే కొన్ని సన్నివేశాలను కూడా మక్కీ టూ మక్కీ కాపి కొట్టేశారని రచయిత్రి ఆరోపించారు. రిపోర్ట్ రాసుకున్న పోలీసులు IPC సెక్షన్ 120A, 415, 420 మరియు కాపిరైట్ యాక్ట్ 1963 కొంద కేసు బుక్ చేసారు. నవల పూర్తిగా చదివిన తరువాత దిల్ రాజుతో, దశరథ్ తో మాట్లాడి తదుపరి కార్యచరణ గురించి ఆలోచిస్తామని పోలీసులు చెప్పారు.

సినిమా విడుదలైన అరేళ్ళ తరువాత కేసు బుక్ చేయడం ఒక ఆశ్చర్యకరమైన విషయమైతే దర్శకుడు బాబి మీద కేసు బుక్ కాకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే మిస్టర్ పెర్ఫెక్ట్ కి కథ సమకూర్చింది సర్దార్ గబ్బర్ సింగ్, జైలవకుశ చిత్రాలకు దర్శకత్వం వహించిన బాబి కావడం విశేషం.