బాబు మహేష్‌.. ప్లీజ్‌ అలా వద్దు     2018-05-17   06:45:57  IST  Raghu V

బ్లాక్‌ బస్టర్‌ ‘భరత్‌ అనే నేను’ చిత్రం తర్వాత మహేష్‌బాబు చేయబోతున్న సినిమాపై అందరి అంచనాలున్నాయి. పైగా మహేష్‌బాబుకు 25వ సినిమా అవ్వడం వల్ల కూడా అంచనాలు రాబోతున్న సినిమాపై భారీగా ఉన్నాయి. వంశీ పైడిపల్లి ఒక విభిన్నమైన కథాంశంతో మహేష్‌ 25వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపు ఆరు నెలలుగా అవుతూనే ఉంది. ఇటీవలే ఈ సినిమా నటీనటుల ఎంపిక పూర్తి అయ్యింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. ఈ సమయంలోనే మహేష్‌బాబు సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటి వరకు మహేష్‌బాబు నటించిన 24 సినిమాల్లో ఏ ఒక్క సినిమాలో కూడా మీసకట్టుతో కనిపించలేదు. ఇటీవలే విడుదలైన భరత్‌ అనే నేను చిత్రంలో మారువేశంలో బయట తిరగడం కోసం మీసం పెట్టుకుని కనిపించాడు. మీసం పెట్టుకుంటే మహేష్‌బాబును సినిమాలోనే కాదు బయట కూడా గుర్తించడం కష్టం. ఎందుకంటే మహేష్‌ను ఎన్నో సంవత్సరాలుగా మీసాలు లేకుండా మాత్రమే మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు మీసాలతో చూడమంటే ఇబ్బందని చెప్పక తప్పదు. మహేష్‌బాబు అంటే ఒక రకమైన అభిప్రాయంలో ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఉంటారు. అందుకే అలాంటి వారు ఈ కొత్త లుక్‌లో మహేష్‌బాబును చూడటం కష్టం.