పవన్ సొంత జిల్లా నుంచే బరిలోకి దిగబోతున్నాడా ..  

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం గందరగోళంగా కనిపిస్తోంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు అనే విషయంలో ఇంకా గందరగోళం పోలేదు. మొదట రాయలసీమ ప్రాంతాన్ని కవర్ చేసేలా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తాడు అనే ప్రచారం జరిగింది. మొన్నా మధ్య పవన్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఆ ప్రాంతం నుంచి పోటీ చేస్తాను అంటూ పవన్ ఆసక్తికర ప్రకటనలు చేసాడు. తాజాగా పవన్‌కల్యాణ్‌ ఏలూరులో ఓటు హక్కు పొందడంతో అభిమానులు, ఆ పార్టీ నాయకుల్లో ఈ చర్చ మొదలైంది. గతంలో ఏలూరు పోస్టల్‌ కాలనీలో ఓ ఇల్లును పవన్‌ పేరిట నాయకులు అద్దెకు తీసుకున్నారు. అదే ఇంటి చిరునామాతో ఓటుహక్కు పొందారు. ఇంతకీ పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ పశ్చిమ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

ఈ నేపథ్యంలోనే పవన్ తన సొంత జిల్లా నుంచి పోటీ చేస్తారు అనే వాదనలు ఇపుడు మొదలయ్యాయి. పవన్ సామజిక వర్గం ఎక్కువగా ఉండే .. గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకే అధికారం దక్కే అవకాశం ఉందనే సెంటిమెంట్ ఉండడంతో పవన్ ఇప్పుడు తన ఫోకస్ అంతా గోదావరి జిల్లాల మీద పెట్టినట్టు తెలుస్తోంది.

పవన్ సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు నరసాపురం నియోజకవర్గం పరిధిలో ఉంది. పవన్‌కల్యాణ్‌ మా ప్రాంతవాసే అనే అభిప్రాయం అక్కడ స్థానికుల్లో ఉంది. దాంతో అక్కడి నుంచే పోటీ చేయించాలని కొంతమంది పార్టీ నాయకులూ తహతహలాడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరో వాదన కూడా తెరమీదకు వచ్చింది అదే పాలకొల్లు నుంచి పవన్ పోటీ చేస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే… ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అధినేత చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. అదే స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ను పోటీ చేయించి గెలిపించి తీరాలనే కసితో ఉన్నామని పాలకొల్లు ప్రాంత నాయకులు చెబుతున్నారు.

పవన్‌ కల్యాణ్‌కు అండగా ఉండే వర్గం ఓటర్లు ఉన్న ప్రాంతం కావడంతో ఈ జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమనే భావనలో ఆ నాయకులు ఉన్నారు.
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున పవన్ ఎక్కడి నుంచి అయితే సులువుగా గెలవగలడో ఒక సర్వే చేయించి ఆ సర్వే ఫలితాల ఆధారంగా నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో అధినేత ఉన్నట్టు మరికొంతమంది నాయకులు చెప్పుకొస్తున్నారు.