పవన్ ని నమ్మని నాయకులు .. అదే జనసేన దుస్థితికి కారణమా ..?    2018-05-28   00:45:41  IST 

ఒక రాజకీయ పార్టీని నడపడమంటే ఆషామాషీ కాదు. ఎన్నో వ్యూహాలు .. ఎన్నెన్నో ఆలోచనలు ఉండాలి. అంతెందుకు ప్రతిక్షణం అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎత్తుకు పై ఎట్టు వేస్తూ ప్రత్యర్థి పార్టీలను కంగారు పెట్టాలి. మన బలం ఏంటో … ప్రత్యర్థుల బలహీనతలు ఏంటో ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి అప్పుడే పార్టీ మనుగడ సాధ్యం అవుతుంది. ఇవేవి లేకపోతే కొంతకాలం పార్టీ పెట్టిన వ్యక్తి ఛరిష్మా మీద నడిచినా ఆ తరువాత మాత్రం కనుమరుగు అయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన మీద కూడా ఇటువంటి చర్చలే నడుస్తున్నాయి. ఆ పార్టీ కి ఇప్పటివరకు ఒక రాజకీయ విధానం అంటూ కనిపించడమే లేదు.

175 స్థానాల్లో పోటీ చేసేస్తామని ఘనంగా పవన్ ప్రకటిస్తున్నా ఇప్పటివరకు అందుకు తగ్గా కసరత్తు అయితే జరగడంలేదు. ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఎవరూ కనిపించడం లేదు. పైపెచ్చు జనసేనకు 05 , ఆరు సీట్లు మించి రావు అనే ప్రచారం కూడా బాగా జోరందుకుంది. జనసేనలో అంతా పవన్‌ అభిమాను లే కనిపిస్తున్నారు. పవన్‌కు కొత్తగా ఎలాంటి వ్యూహం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తన వ్యూహం ఫలిస్తుందని మొదటి నుంచి చెప్పుకొచ్చిన పవన్‌.. అసలు తనకు ఎలాంటి వ్యూహం లేదని, ప్రజలే వ్యూహం సిద్ధం చేయాలని అనడం ఆయన రాజకీయ అజ్ఞానాన్ని తెలియజేస్తోంది.