చిరు బాటలో పవన్ ఎందుకంటే ఆయన తమ్ముడు కాబట్టి  

మెల్లి మెల్లిగా పవన్ తన అన్న చిరంజీవి చూపించిన బాటలోనే వెళ్లేలా తన రాజకీయ అడుగులు వేస్తున్నాడు. మొన్న మెగా అభిమానులందరినీ జనసీలో చేర్చేసుకున్నాడు. ఇక మెగా బ్రదర్ పార్టీలోకి రావడమే మిగిలి ఉంది. ఈ లోపు తన రాజకీయ ప్రస్థానాన్ని సక్సెస్ చేసేందుకు యాత్రల పేరుతో బాగానే కష్టపడుతున్నాడు. ప్రజారాజ్యాల్లో జరిగిన తప్పులేవీ ఇక్కడ జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు కానీ ఎన్నికల్లో పవన్ పోటీ చేసే విషయంలోనే తన అన్న చిరులా రెండు చోట్ల పోటీ చేసేందుకు పవన్ సిద్ధం అవుతున్నాడు.

దీనికి గత అనుభవాలు కూడా కారణమే అని తెలుస్తోంది. పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం తరఫున 2009లో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుతో పాటు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తిరుపతిలో గెలిచారు. కానీ పాలకొల్లులో కాంగ్రెస్ మహిళా అభ్యర్ధి ఉషారాణి చేతిలో ఘోర పరాజయం పొందారు. అదే భయం పవన్ లో కూడా కలగడంతో ఎందుకైనా మంచిది రెండు చోట్ల పోటీ చేస్తేనే బెటర్ అనే ఆలోచనకు పవన్ వచ్చేసాడు. అయితే పవన్ ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు అనేదానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేసింది.

2017 నవంబరు 10న అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ జిల్లా కరువు కాటకాలతో అల్లాడిపోతోంది. పస్తులతో జనం వలసలు పోతున్నారు. వేశ్యావాటికల్లో మగ్గిపోతున్నారు. నేను ఎమ్మెల్యే అయితే ఈ పరిస్థితిని మారుస్తాను. ఆకలికేకలు లేని అనంత జిల్లాను సాధిస్తాను. అని ఉపన్యాసమిచ్చారు. అందుకే నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను. గెలిచినా ఓడినా నేను బరిలో దిగేది అనంతపురం జిల్లా నుంచే అని అనంత ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. మళ్ళీ ఉత్తరాంధ్ర యాత్రలో . ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి నేను శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తాను. అని చెప్పారు.

ఒకే చోట నుంచి పోటీ చేసి ఓటమి పాలైతే పార్టీ అధ్యక్షుడిగా పరువు పోవడంతో పాటు, పార్టీలో, రాజకీయాల్లో భవిష్యత్ శూన్యం అని పవన్ కి అన్నయ్య చిరంజీవితో పాటు పలువురు రాజకీయ ఉద్ధండులు, మోడీ కనుసన్నల్లో పనిచేసే బీజేపీ మిత్రులు సలహాలిచ్చారు. పార్టీ అధ్యక్షుడే ఓడిపోయి, ఓ పది పదిహేను సీట్లు వచ్చినా, ఆ పార్టీలో పవన్ కి స్థానముండదని, పార్టీని గెలిచిన వారు హస్తగతం చేసుకుని, పవన్ ను సాగనంపేస్తారని విశ్లేషకులు, రాజకీయ అనుభవజ్ఞులు హెచ్చరించారు. దీంతో డైలమాలో పడిన పవన్ రెండు చోట్ల పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది.