క‌ర్ణాట‌క‌లో ప‌వ‌న్‌కు జేడీఎస్ ఇచ్చిన టార్గెట్ ఇదే...     2018-04-29   00:19:07  IST  Bhanu C

క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌లు ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో అక్క‌డ స్థిర‌ప‌డిన తెలుగువారి ఓట‌ర్లు కీల‌కంగా ఉన్నాయి. ఉత్త‌ర క‌ర్ణాక‌ట‌, త‌దిత‌ర ప్రాంతాలు క‌లుపుకొని మొత్తం 12జిల్లాల్లోని 60 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఓట‌ములను ప్ర‌భావితం చేసే స్థాయిలో తెలుగుఓట‌ర్లు ఉన్నారు. అయితే ఈసారి తెలుగు ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌త్యేక అంశాలు ఉన్నాయి. తెలుగుఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు ప‌లువురు తెలుగు హీరోల‌తో ప్ర‌చారం చేయించ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి.

తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్, ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వారు క‌ర్ణాట‌క‌లో చాలామంది ఉన్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా తెలుగువారి ఓట్ల‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. జేడీఎస్ త‌రుపున జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌చారం చేస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఉత్త‌ర క‌ర్ణాట‌క‌లో ఆయ‌న ప్ర‌చారం చేస్తార‌ని, ఈ ప్రాంతంలో కనీసం 18 స్థానాలు గెలవడమే తమ లక్ష్యమని అంటున్నాయి. జేడీఎస్ నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామికి ప‌వ‌న్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే స్టార్ కంపెయినర్లుగా హీరో నిఖిల్, హీరోయిన్ పూజాగాంధీ పేర్లు ప్రకటించామని, వారు ఉత్తర కర్నాటకలో ప్రచారం చేస్తారని చెప్పారు.