ప‌వ‌న్ టార్గెట్ ఎన్ని సీట్లు.... రీచ్ అవుతాడా..!     2018-06-09   23:58:41  IST  Bhanu C

మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్న ఏపీలో రెండు ప్ర‌ధాన పార్టీలు టీడీపీ, వైసీపీల‌కు దీటుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా విజృంభిస్తున్నారు. ప్ర‌జ‌లు త‌మ‌ను ఆశీర్వ‌దిస్తే.. అధికారంలోకి వ‌చ్చేందుకు రెడీ అంటూ ఆయ‌న ఇటీవ‌ల వ్యాఖ్యానించాడు. అయితే, ఆయ‌నకు అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన హంగు, ఆర్భాటాలు ఉన్నాయా? అనేది ప్ర‌ధానంగా తెర‌మీదికి వ‌స్తున్న అంశం. నిజానికి పార్టీ స్థాపించి నాలుగేళ్లు పూర్తి అయినా ఇప్ప‌టికీ.. పార్టీకి పూర్తిస్థాయిలో ఎలాంటి కేడ‌ర్ పూర్తిస్థాయిలో లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

అదే స‌మ‌యంలో పార్టీని అధికారంలోకి తేవ‌డంలో ప్ర‌ధాన భూమిక పోషించే నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జుల విష‌యంలోనూ ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు. పైగా వ‌చ్చే ఎన్నిక‌లకు సంబంధించి తాను మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అయితే, ఇప్ప‌టికి ఉన్న ప్ర‌ధాన పార్టీల్లో టీడీపీకి మాత్రమే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కీల‌క‌మైన అభ్య‌ర్థులు ఉన్నారు. మిగిలిన ఏ పార్టీకి కూడా వైసీపీ స‌హా దేనికీ.. అన్ని నియోజ‌క‌వ‌ర్గా ల్లోనూ కీల‌క‌మైన గెలుపు గుర్రాలులేవు. మ‌రి అలాంటిది జ‌న‌సేన‌కు ఉన్నారా? అంటే ప‌ట్టుమ‌ని 50 సీట్ల‌లో కూడా కీల‌క‌మైన అభ్య‌ర్థులు లేరు. ఈ ప‌రిణామం ప‌వ‌న్‌కు ప్ర‌ధానంగా దెబ్బ‌కొట్టే ప‌రిణామం.