మారిన ప‌వ‌న్ వ్యూహం.. టీడీపీకి దెబ్బేనా..?     2018-05-09   23:52:40  IST  Bhanu C

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ వ్యూహం మారుతోందా ? వ‌చ్చేఎ న్నిక‌ల్లో 175 స్థానాల్లోనూ పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఇప్పుడు త‌న‌కు బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌తోపాటు.. టీడీపీని దెబ్బ‌కొట్ట‌గ‌లిగేలా.. ఉండే నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంచుకుంటున్నారా? అంటే ఔననే స‌మాధాన‌మే వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను స్వ‌యంగా పోటీ చేసి తీర‌తాన‌ని ప‌వ‌న్ ఏడాదిన్న‌ర కింద‌టే ప్ర‌క‌టించాడు. అంతేకాదు, తాను పోటీ చేసేది కూడా వెనుక‌బ‌డ్డ జిల్లా అనంత‌పురం నుంచేన‌ని చెప్పుకొచ్చాడు. దీనిని బ‌ట్టి అంద‌రూ అనంత‌పురం ఎమ్మెల్యే సీటు నుంచి ప‌వ‌న్ రంగంలోకి దిగ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు.

ఇక్క‌డ నిజానికి ప‌వ‌న్ ఫాలోయింగ్ ఎక్కువ‌. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఎంపీగా బ‌రిలోకి దిగిన జేసీ దివాక‌ర్‌రెడ్డి ప‌నిగ‌ట్టుకుని ప‌వ‌న్‌ను హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో అనంత‌పురం తీసుకు వెళ్లి ఒక రోజు మొత్తం ప్ర‌చారం చేయించుకున్నాడు. ఫ‌లితంగా అత్య‌ధిక మెజారిటీతో జేసీ విజ‌యం సాధించాడు. ఇలా ప‌వ‌న్‌కు అత్యంత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఏదంటే అనంతుపుర‌మనే చెప్పాలి. అయితే, ప‌వ‌న్ ఇప్పుడు వ్యూహం మార్చుకున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌రింత స్పీడ్‌గా నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడు.