ఆర్జీస్ స‌ర్వేపై.. జ‌న‌సేన మౌనం వెన‌క ఇంత క‌థ ఉందా...!     2018-06-19   00:10:04  IST  Bhanu C

రాష్ట్రాన్ని రెండు రోజులుగా రాజ‌కీయంగా కుదుపుల‌కు గురి చేసిన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే.. జ‌న‌సేనకు మాత్రం చీమ‌కుట్టిన‌ట్ట‌యినా అనిపించ‌లేదు! త‌మ‌కు కాపు బ‌లం ఉంద‌ని, యువ‌త మొత్తం త‌మ వెంటే న‌డుస్తుంద‌ని భావించిన ప‌వ‌న్‌కు వ్య‌తిరేకంగా ఈ స‌ర్వే రిజ‌ల్ట్ సాగింది. మొత్తం 175 స్థానాల్లోనూ తాము పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఇలా అయితే, ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు.. మొత్తంగా ప‌వ‌న్‌కు ప‌డుతుంద‌ని అప్ప‌ట్లోనే విశ్లేష‌కులు పెద్ద ఎత్తున వ్యాఖ్యానాలు రాశారు. ముఖ్యంగా తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి, గుంటూరు, కృష్ణా, అనంత‌పురం, శ్రీకాకుళం త‌దిత‌ర జిల్లాల్లో జ‌న‌సేన ప్ర‌భావం భారీ గా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామం చంద్ర‌బాబుపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని కూడా విశ్లేష‌ణ‌లు సాగాయి.

కానీ, ఆంధ్రా ఆక్టోప‌స్ నిర్వ‌హించిన స‌ర్వేలో మాత్రం ఈ వ్యాఖ్యానాలు అబ‌ద్ధ‌మ‌ని తేలిపోయిన‌ట్టు రిజ‌ల్ట్ వెల్ల‌డించింది. అంతేకాదు.. ప‌వ‌న్ మ‌దిలో ఉన్న 40% ఓటు బ్యాంకును 8%కి కుదించేసింది. ప‌వ‌న్ ఎన్ని స్థానాల్లో పోటీ చేసిన‌ప్ప‌టికీ ఒక‌టి, రెండు సీట్ల‌కుమించి గెలిచే అవ‌కాశం కూడా లేద‌ని చెప్పుకొచ్చింది. అంతేకాదు, శ్రీకాకుళంలో మాత్రం ఈ సీట్ల‌యినా ద‌క్కుతాయ‌ని చెప్పుకొచ్చింది. అది కూడా 8% ఓటు బ్యాంకు మాత్ర‌మే ప‌వ‌న్‌కు ద‌క్కుతుంద‌ని పేర్కొంది. నిజానికి ఉవ్వెత్తున ఎగిసి ప‌డాల‌ని భావిస్తున్న ప‌వ‌న్‌కు ఈ రిజ‌ల్ట్ పెను శ‌రాఘాతం. కానీ, ఆయ‌న ఈ స‌ర్వేపై స్పందించ లేదు. పోనీ.. ఆయ‌న త‌ర‌ఫున కానీ, పార్టీ గ‌ళంగా కానీ, ఎవ‌రూ స్పందించ‌లేదు. దీనిపై మొత్తంగా అస‌లు త‌మ‌కు ఏమీ తెలియ‌ద‌ని అన్న‌ట్టుగానే జ‌నేసేనానులు వ్య‌వ‌హ‌రించారు.