99 ఛానెల్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు !  

రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే ప్రస్తుత రోజుల్లో మీడియా అవసరం చాలా ఉంది. తాము ఏం చేస్తున్నాం..? ఏమి చేయబోతున్నాం ..? అనే విషయాలు ప్రజల్లోకి వెళ్లాలంటే అది మీడియా ద్వారానే సాధ్యం. ఈ విషయాలు తెలుసు కనుకే రాజకీయ పార్టీలన్నీ సొంతంగా ఛానెల్స్ ఏర్పాటు చేసుకుని, లేక కొన్ని ఛానెల్స్ తో ఒప్పందం పెట్టుకుని ఎవరి సొంత డప్పు వాళ్ళు కొట్టుకుంటున్నారు. అయితే కొత్తగా వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కి మాత్రం ఆ లోటు చాలా కనిపించింది. మొదట్లో మీడియా ఫోకస్ బాగానే ఉండేది కొద్దీ నెలల క్రితం మీడియా తో సున్నం పెట్టుకోవడంతో కవరేజ్ కట్ అయిపోయింది. పవన్ చేస్తున్న యాత్రలు ప్రజల్లోకి వెళ్లాలంటే సొంతంగా మీడియా ఉండాలని పవన్ ఒక నిర్ణయానికి వచ్చేసాడు.

గతంలోనే 99 టీవీ చానల్‌ను కొనుగోలు చేసేందుకు పవన్ సిద్ధమయినట్లు ప్రచారం జరిగింది. డీల్ కుదిరిందని..చెల్లింపులే ఆలస్యమని వార్తలు చెలామణిలోకి వచ్చినప్పటికీ ఈ కొనుగోలు జరగలేదు. కొద్దికాలం తర్వాత ఆ ప్రకటనే నిజమయింది. సీపీఐ నేతల చేతుల్లో ఉన్న 99 టీవీ ఛానల్‌ను పవన్ పార్టీకి మాజీ ఐఏఎస్, జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. ఇప్పటికే ఆయనకు ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. అలా జనసేనకు పరోక్షంగా ఓ మీడియా చానల్ వచ్చింది. అయితే దీని గురించి చర్చలే తప్ప పవన్ ప్రకటించింది ఎక్కడా లేదు.

కానీ తాజాగా పవన్ స్వయంగా 99 టీవీ చానల్ జనసేనదని ప్రకటించారు. హైదరాబాద్ లో జనసేన ఐటీ సెంటర్‌ను పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలు ఈ కార్యక్రమానికి హాజరవగా..పవన్ 99 టీవీ ఛానల్ లోగోను చూస్తూ…’ఓహ్‌..మనదే. మనదే’ అంటూ పేర్కొన్నారు. పవన్ స్వతహాగా అంగీకరించడంతో ఛానల్ విషయంలో స్పష్టత వచ్చిందంటున్నారు. ఇక ఈ ఛానెల్ విషయంలో ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో లేక పొరపాటున నోరు జారీ మాట్లాడారో తెలియదు కానీ నిజం మాత్రం ఒప్పేసుకుని అందరికి ఒక క్లారిటీ ఇచ్చేసాడు జనసేనాని.