పవన్ చెప్పేందుకే నీతులు ... పాటించేందుకు కాదు !     2018-05-24   01:54:38  IST  Bhanu C

చెప్పేందుకే శ్రీరంగ నీతులు .. చేసేందుకు కాదు అన్నట్టు ఉంది ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరు. పవన్ ఇప్పుడు రాజకీయాల్లో ప్రజల మధ్య తిరుగుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకి ఖచ్చితంగా విశ్వసనీయత ఉండాలి. ఏదిపడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఇది సినిమా కాదు. ఆ సినిమా డైలాగ్స్ బట్టి పట్టి చెప్పేసి.. ఆనక మరో సినిమాలో మరో కొత్త డైలాగ్స్ చెప్పెయ్యడానికి.

నేను ముఖ్యమంత్రిని కాబోతున్నా.. మన ప్రభుత్వం వచ్చేస్తోంది అంటూ పవన్ చేస్తున్న యాత్రలో పదే పదే చెప్తున్నాడు. జగన్ మోహన్ రెడ్డిని ఏ విషయంలో అయితే పీకే విమర్శించాడో ఇప్పుడే అదే ప్రకటనతో నవ్వుల పాలు అవుతున్నాడు. జగన్ తను ముఖ్యమంత్రి అయితే సమస్యలను పరిష్కరించగలను అని, తమ ప్రభుత్వం వస్తే మంచి చేస్తాను అని అంటే.. అప్పట్లో పవన్ ఆ మాటలను ఎద్దేవా చేశాడు. అన్ని సమస్యలనూ ముఖ్యమంత్రి అయితేనే తీరుస్తాను అని అనడం విడ్డూరమని పవన్ వెటకారం చేసాడు. కానీ ఇప్పుడు అది మరిచిపోయి జగన్ బాటలోకి పవన్ వచ్చేసాడు.