పాతిక సీట్లే ల‌క్ష్యంగా ప‌వ‌న్ పోరాట యాత్ర‌!     2018-06-07   02:08:57  IST  Bhanu C

రాజ‌కీయ నేత‌లు ఏం చేస్తున్నా.. ఒక‌ప్పుడు ఎవ‌రు ప‌ట్టించుకుంటారులే.. అనుకునేవారు. కానీ, నేడు విస్తృత ప్ర‌సార మాధ్య‌మాలు, విస్తృత మీడియా పుణ్య‌మాని.. రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు ఏ క్ష‌ణాన ఏం చేస్తున్నా.. జ‌నాల‌కు ఇట్టే స‌మాచారం చేరిపోతోంది. దీంతో అదేస‌మ‌యంలో ఆయా నాయ‌కుల‌పై స‌టైర్లూ అంతే వేగంగా పేలుతున్నాయి. ప్ర‌స్తుతం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కూడా ఇప్పుడు నెటిజ‌న్లు ఇలానే స‌టైర్ల‌తో కుమ్మేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలు ఉండ‌గా.. ప‌వ‌న్ మాత్రం కేవ‌లం ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌నే ఎంచుకుని ప్ర‌జా పోరాట యాత్ర పేరిట 45 రోజుల షెడ్యూల్‌ను నిర్ణ‌యించుకుని ప‌ర్య‌టించ‌డంపై నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ప‌వ‌న్.. ఉత్త‌రాంధ్ర హీరో! అంటూ కొంద‌రు వ్యాఖ్యానిస్తే.. మ‌రికొంద‌రు జ‌న‌సేన.. ఉత్త‌రాంధ్ర పార్టీ అంటూ సెల‌విస్తున్నారు. నిజానికి మ‌రో 10 మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో జ‌న‌సేన వంటి పుట్టి క‌న్నుతెర‌వ‌ని పార్టీ అన్ని జిల్లాల‌నుఓన్ చేసుకునే విధంగా ప‌క్కా కార్య‌చ‌ర‌ణ‌తో ముందుకు సాగాలి. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో ఉన్న వైసీపీ, అధికార టీడీపీలు. కేవ‌లం ఒక‌టి రెండు జిల్లాల‌కే ప‌రిమితం కాకుండా.. అన్ని జిల్లాల్లోనూ త‌మ‌హ‌వాను ప్ర‌ద‌ర్శించేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అధికారంలో ఉండి కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌తి జిల్లాలోనూ నిత్యం ఏదో ఒక కార్య‌క్ర‌మం పేరుతో విజృంభిస్తున్నారు.