ఆయ‌న ఎంట్రీపై జనసేనలో అప్పుడే అనుమానాలు  

జనపార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యకాలంలో రాజకీయ దూకుడు కూడా బాగా పెంచాడు. దీనిలో భాగంగానే… పార్టీలోకి కీలకమైన నేతలను ఆహ్వానిస్తూ పనిలోపనిగా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నాడు. ఇప్పటికే బలమైన పార్టీలుగా ఉన్న టీడీపీ- వైసీపీలను ఎదుర్కోవడం అంత సులువు కాకపోయినా.. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాని పక్షంలో జనసేన గెలిచే స్థానాలే కీలకం అవుతాయని పవన్ భావిస్తున్నాడు. అందుకే కనీసం 50-60 సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇందుకు ఉత్తరాంధ్ర జిల్లాలను ఆయుధంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పవన్ దాడిని జనసేనలోకి ఆహ్వానించారు. అందుకు దాడి తన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇప్పుడు దాడి జనసేనలో చేరిపోయారు. ఇప్పటికే పలు పార్టీ మారిన దాడి కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. కానీ ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా ఆయన మళ్లీ యాక్టీవ్ అయినట్లు తెలుస్తోంది.