పల్లెటూరు బాట పట్టిన టాలీవుడ్‌!    2018-06-08   22:57:58  IST  Raghu V

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు ఎక్కువగా పల్లెటూరు అందాు కనిపించేవి. ఆ తర్వాత పరిస్థితి మారింది. ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ మరియు పట్టణాల్లో చిత్రీకరణ చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చిందనిపిస్తుంది. తెలుగులో ఈమద్య కాలంలో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఎక్కువ శాతం పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కడం విశేషం. భారీ ఎత్తున బడ్జెట్‌ అవసరం లేదు, సింపుల్‌గా తక్కువ బడ్జెట్‌తో కూడా మంచి లుక్‌తో పల్లెటూరు నేపథ్యంలో సినిమాలను తీర్చిదిద్దగలం. అందుకే దర్శకులు పల్లెటూరు వైపుకు మొగ్గు చూపుతున్నారు. ఈమద్య వచ్చిన చిత్రాల్లో పల్లె అందాలను చక్కగా చూపించారు.

గత సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘శతమానంభవతి’ చిత్రంలో దర్శకుడు సతీష్‌ వేగేశ్న పల్లె అందాలను, అక్కడ అనుబంధాలను, స్నేహాలను చక్కగా చూపించి ఆకట్టుకున్నాడు. పల్లె అందాలతో రూపొందిన ఆ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు సైతం దక్కింది. ఆ చిత్రం శర్వానంద్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా నిలిచింది. ఆ తర్వాత త్రివిక్రమ్‌ ‘అఆ’ చిత్రంతో పల్లె అందాలను చూపించాడు. సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తాజాగా ‘రంగస్థలం’ చిత్రం మొత్తం కూడా పల్లెటూరులోనే కొనసాగింది. అది కాకుండా 1980 కాలంలో పల్లెటూర్లు ఎలా ఉండేవి అనేది కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించి సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు.