ప‌వ‌న్ చెప్పేదొక‌టి చేసేదొక‌టి... పార్టీని వాళ్ల‌తోనే నింపేస్తున్నాడుగా     2018-05-20   23:55:13  IST  Bhanu C

వినూత్న‌, పార‌ద‌ర్శ‌క రాజ‌కీయాలకు అంబాసిడ‌ర్‌ను నేనేనంటూ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన జ‌న‌సేనాని ప‌వ‌న్.. వైఖ‌రిపై విభిన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఆయ‌న మాట‌లు, వైఖ‌రిలో నిల‌క‌డ లేక‌పోవ‌డం, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో కూ డా క్లారిటీ రాక‌పోవ‌డం వంటివి ఆయ‌న‌ను సందేహాల పుట్ట‌గా మార్చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న సిద్ధాంతాల కు క‌ట్టుబ‌డి రాజ‌కీయాలు చేస్తే.. పొలిటిక‌ల్‌గా ఎంత మేర‌కువిజ‌యం సాధిస్తాడ‌నేది కూడా సందేహంగానే ఉంది. ఇక‌, తాజాగా విష‌యంలోకి వెళ్తే.. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో తాను 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, త‌న‌ది ఇక, ఒంట‌రి పోరేన‌ని అన్నారు.

అయితే, కొమ్ములు తిరిగిన పార్టీల‌కే ఇప్పుడు నేత‌లు క‌రువ‌య్యారు. అలాంటిది.. ప‌వ‌న్ పార్టీకి నేత‌లు ఎక్క‌డ నుంచి వ‌స్తారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. పోనీ.. ఇత‌ర పార్టీల్లోని నాయ‌కుల‌ను ఆక‌ర్షిస్తారా? మాజీల‌కు పెద్ద పీట వేస్తారా? అనేది కూడా ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. తాను ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకోన‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. అయితే, 175 నియొజ‌క‌వ‌ర్గాల్లోనూ కీల‌కంగా పోటీ ఇవ్వ‌గ‌లిగిన స‌త్తా ఉన్న నాయ‌కులు జ‌న‌సేన‌లో ఎలా ఉంటారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. పోనీ.. త‌న మాట‌ల‌ను తానే గ‌ట్టున పెడ‌తాడా? అంటే ఇప్ప‌టికీ ఎలాంటి క్లూ ఇవ్వ‌డం లేదు. అయితే,ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు మాత్రం ప‌వ‌న్ పిలుపే ఆల‌స్యం అన్న విధంగా ఎదురు చూస్తున్నారు.