Vijay Kumar Konda to direct Mega Hero ?

‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ చిత్రాలతో యూత్‌ను ఆకట్టుకన్న దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొండ. ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్‌ను తెచ్చుకోవడంతో ఈయనకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఈయన దర్శకత్వంలో నటించేందుకు యంగ్‌ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈయన మాత్రం మెగా హీరో, స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని కలలు కంటున్నాడు. ప్రస్తుతం ఈయన ఆ పనిలో బిజీగా ఉన్నట్లుగా సినీ వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల కాగానే మరో సినిమాను చేసేందుకు అల్లు అర్జున్‌ ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నాడు. అందుకే ఇప్పటికే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బన్నీ కోసం ఒక క్లాస్‌ తరహా స్క్రిప్ట్‌ను శేఖర్‌ కమ్ముల రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు మొదలు అవుతుందనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే విజయ్‌ కుమార్‌కు కూడా బన్నీ ఓకే చెప్తే ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో అని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి బన్నీతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న విజయ్‌ కుమార్‌ కొండాను అంతా అభినందిస్తున్నారు.