రాజకీయ పార్టీలు.. సరికొత్త రాజకీయం !     2018-07-02   05:43:39  IST  Bhanu C

అడ్డు అదుపు లేకుండా మాట్లాడడం .. చేసేది ఏమి లేకపోయినా ఏదో చేసేసినట్టు కలరింగ్ ఇవ్వడం.. నాలుకను నానా రకాలుగా మడతపెట్టి అడ్డమైన వాగ్దానాలు ఇవ్వడం రాజకీయ నాయకులకు .. పార్టీలకు కొత్తేమి కాదు. అందుకే రాజకీయ నాయకుల మాటలకి విశ్వసనీయత ఉండదు. ఇక ఎన్నికల సమయంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు రాజకీయాలు హుందాగా ఉండేవి కానీ ఇప్పుడు రాజకీయాలు మరీ దిగజారిపోయాయి. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా పార్టీల పరిస్థితి తయారయ్యింది. విలువలు .. విశ్వసనీయత అనే వాటి గురించయితే ఇప్పుడు వెతకడం కుడా అనవసరమే. ప్రతి పార్టీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా పొత్తులు పెట్టుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి.

ప్రజలకు పనికివచ్చే రాజకీయం కన్నా .. వారి వారి పార్టీలను గట్టెక్కించుకునేందుకు,స్వార్థ ప్రయోజనాల కోసం ఏది పడితే అదే మాట్లాడుతున్నారు.వాళ్ల మాటల్లో, ప్రసంగాల్లో రాజకీయ ఆరోపణలు,ప్రత్యారోపణలు,విమర్శలు మినహా, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేవి ఒక్కటి కూడా కనిపించడంలేదు. ఇక ఎన్నికలు ముందస్తుగా వచ్చేయబోతున్నాయి అని తేలడంతో పార్టీల్లో ఎక్కడలేని హడావుడి కనిపిస్తోంది. అమాంతం ప్రజలపై ప్రేమ మాటల్లో పొంగిపోతోంది.