మోదీ కన్ను తమిళనాడు మీద పడిందా ..  

ఏ సమయంలో ఎక్కడ ఏ రాజకీయం చేయాలో తెలిసినవాడే రాజకీయ మేధావి. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా తమ ఖాతాలో వేసుకునేందుకు కాసుకొని కూర్చుంటారు. మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు అదే పని చేయబోతున్నాడు. ఎప్పటి నుంచో దక్షిణాది రాష్టాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీకి ఇప్పుడు తమిళనాడు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఇప్పటివరకు అక్కడ రాజకీయాలను శాసించిన కరుణానిధి, జయలలిత.. ఇద్దరూ ఇప్పుడు లేరు! నిజానికి, జయలలిత మరణంతో మొదలైన రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, ఈ నేపథ్యంలో తమిళనాడులో సొంత బలం పెంచుకోవడం కోసం బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది.

తమిళనాడులో బిజెపికి పెద్దగా పట్టు లేదు. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా బలంగా ఉన్న సమయంలో కూడా అక్కడ బిజెపిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. తమిళనాడులో ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటును దక్కించుకోగలిగింది. ఆ తరువాత, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా 232 స్థానాల్లో పోటీకి దిగింది. కేవలం 2.8 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి! భాజపా కంటే కాంగ్రెస్సే కొంచెం నయం అనిపిస్తోంది. ఆ పార్టీకి 6.4 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో తమిళనాడులో బిజెపికి సొంతంగా పునాదులు ఏర్పాటు చేసుకోవడం అంత ఈజీగా సాధ్యమయ్యే పని కాదనేది బాగానే తెలిసొచ్చింది.

అందుకే ఇప్పుడు అక్కడ కుల రాజకీయాలకు బిజెపి తెర తీసింది. కులాల ప్రాతిపదిక కొన్ని సమావేశాలను బిజెపి అక్కడ నిర్వహిస్తోందని సమాచారం. దేవేంద్రకుల వల్లార్‌, నాడార్లు, విన్నయార్‌, బ్రాహ్మణులు.. ఈ కులాలకు చెందినవారితో సమావేశాలూ సభలూ పెడుతూ.. భాజపా యాక్టివ్ గా ఉండే ప్రయత్నం చేస్తోందట. ఒక దళిత్ కమ్యూనిటీ, ఒక ఓబీసీ గ్రూపు, ఒక ఎంబీసీ గ్రూపు.. ఇలా దేనికవి ప్రత్యేకంగా చూసుకుంటూ, సొంతంగా ఓటు బ్యాంకుని తయారు చేసుకునే వ్యూహంలో ఉన్నట్టు తమిళ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో భాజపాకి దాదాపు 50 లక్షల మంది సభ్యులున్నారని ఆ పార్టీ చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో కనీసం కొన్ని ఎంపీ సీట్లనైనా ఈ రాష్ట్రం నుంచి గెలుచుకుని పట్టు పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది.