చినబాబుకి సైకిల్ 'సీటు' ఒకే ! మరి ఆ బాబు 'సీటు' ఎక్కడో     2018-06-29   01:50:30  IST  Bhanu C

దొడ్డిదారిలో వచ్చి మంత్రయ్యాడు … ఆయనకేం తెలుసు ఆయన వట్టి పప్పు. ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన పనికిరాడు… ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా లేదు. ఇలాంటి వార్తలు తరచూ వస్తుండడంతో పాటు రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి రావడంతో లోకేష్ చాలాకాలంగా ఆలోచనలో పడ్డాడు. ఈ ఆరోపణలకు పులిస్టాప్ పెట్టాలంటే వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి తీరాలని లోకేష్ కంకణం కట్టుకున్నాడు. చంద్రబాబు కూడా లోకేష్ ఎన్నికల్లో పోటీ చేస్తేనే మంచిదనే ఆలోచనకు వచ్చాడు. అందుకే ఇప్పటి నుంచే అనువైన నియోజకవర్గం కోసం వెతుకులాట ప్రారంభించారు.

దీనిలో భాగంగానే లోకేష్‌తో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు స్టేట్మెంట్ ఇప్పించాడు బాబు. . ‘ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యం. కానీ ఎక్కడనుంచి అనేది అధినేత మాత్రమే డిసైడ్ చేస్తారు’ అంటూ చినబాబు చెప్పిన మాట.. పార్టీలో ఎన్నికల వేడిని రాజేసింది. లోకేష్ కోసం సీటు త్యాగం చేయడానికి ఇప్పటికే ముగ్గురు నేతలు బహిరంగంగా ముందుకొచ్చారు. అయితే.. వాటన్నిటినీ చంద్రబాబు తిరస్కరించారని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సీటు అయితేనే లోకేష్‌కి బాగుంటుందని చంద్రబాబు డిసైడ్ అయిపోయాడట.