ఇలా అయితే కష్టమే బిగ్‌బాస్‌!     2018-06-22   03:51:45  IST  Raghu V

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బిగ్‌బాస్‌ సీజన్‌ 2 అంతగా ఆకట్టుకోలేక పోతుంది. మొదటి వారం కాస్త పర్వాలేదు అన్నట్లుగా షో ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగింది. కాని రెండవ వారంకు వచ్చేప్పటికి షో చాలా నీరసంగా, నిదానంగా సాగుతూ ప్రేక్షకులకు పరమ బోరింగ్‌గా అనిపిస్తుంది. రెండవ సీజన్‌లో మంచి సెలబ్రెటీలు లేకపోవడంతో పాటు, గత సీజన్‌లో మాదిరిగా మంచి వాతావరణం ఇంట్లో లేదు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తం అవుతుంది. మొదటి రోజు నుండే షోను ఆకట్టుకునే విధంగా చేయాలనే ఉద్దేశ్యంతో బిగ్‌బాస్‌ వేసిన ప్లాన్‌ బెడిసి కొట్టింది. దాంతో ప్రస్తుతం బిగ్‌బాస్‌ కొత్త వ్యూహాలు వేస్తున్నా కూడా ఫలితం దక్కడం లేదు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఆరంభం నుండి కూడా నాని హోస్టింగ్‌ అంతగా ఆకట్టుకోవడం లేదని, అలాగే ఇంట్లోని సభ్యులు నిద్రమొహాలుగా ఉన్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే బిగ్‌బాస్‌ ఇంట్లోని సభ్యులతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయాల్సిన అవసరం ఉంది. కాని రొటీన్‌ టాస్క్‌లు, నిద్ర పుచ్చే టాస్క్‌లు ఇవ్వడంతో బిగ్‌బాస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతుంది. రెండవ వారంలోనే ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో అనే అనుమానాలు సినీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్‌బాస్‌ సీజన్‌ 2 టీఆర్పీ రేటింగ్‌ ఆశించిన స్థాయిలో లేదు.