కాంగ్రెస్ - టీడీపీ పొత్తు ఫిక్స్ చేసేశాడా...!     2018-04-16   22:44:44  IST  Bhanu C

2019 ఎన్నిక‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా జ‌రుగుతాయో ? ఎవ‌రు ఎవ‌రితో పొత్తులు పెట్టుకుంటారో ? కూడా అర్థం కాని ప‌రిస్థితి. ఏపీలో టీడీపీ-బీజేపీ బంధం తెగిపోయింది. తెలంగాణ‌లోనూ, ఏపీలోనూ బీజేపీ, టీడీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇక కొద్ది రోజులుగా టీడీపీ – కాంగ్రెస్ పొత్తు గురించి ప్ర‌ధానంగా తెలుగు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అస‌లు కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖ‌రి, నియంతృత్వ విధానంతో పాటు ఆ పార్టీ తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని తుంగ‌లో తొక్కుతుంద‌నే విమ‌ర్శ‌తోనే నాడు ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారు. ఓవ‌రాల్‌గా కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగానే టీడీపీ పుట్టింది.

క‌ట్ చేస్తే ఇప్పుడు టీడీపీ పుట్టాక మూడున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత తెలుగు రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారాయి. తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. టీడీపీకి రెండు ద‌శాబ్దాలుగా న‌మ్మ‌క‌మైన మిత్రుడిగా ఉన్న బీజేపీతో ఇప్పుడు తీవ్ర‌మైన వైరం ఏర్ప‌డింది. దీంతో ఏపీలో ఓ వైపు అధికారం నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో పాటు మ‌రోవైపు తెలంగాణ‌లో పార్టీ ఉనికిని నిలుపుకోవాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబుకు ఏర్ప‌డింది. ఏపీలోనూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి పొత్తుల ఆవ‌శ్య‌క‌త ఉంది.

పార్టీ అధికారంలో ఉన్న ఏపీలోనే ఇలా ఉంటే ఇక పార్టీ ప‌త‌న‌ద‌శ‌లో ఉన్న తెలంగాణ‌లో పొత్తులు లేకుండా పోటీ చేస్తే టీడీపీ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో సీనియర్లు అంద‌రూ త‌మ దారి తాము చూసుకున్నారు. ఇప్ప‌టికే మోత్కుప‌ల్లి న‌ర్సింహులు లాంటి వారు అయితే పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసేయాల‌ని చెప్పారు. ఆ త‌ర్వాత కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవాల‌ని కొంద‌రు నాయ‌కులు చంద్ర‌బాబుకు సూచించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.