నాగార్జున గుడ్డిగా వెళ్లి పోతున్నాడు     2018-06-12   04:17:54  IST  Raghu V

కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తాజాగా రవితేజ హీరోగా వచ్చిన ‘నేలటిక్కెట్టు’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. ఈ దెబ్బకు నాగార్జున, కళ్యాణ్‌ కృష్ణల కాంబోలో బంగార్రాజు లేనట్లే అంటూ అంతా భావించారు. కాని షాకింగ్‌గా త్వరలోనే బంగార్రాజును మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కినేని వారి హోం బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో సమాచారం అందుతుంది. నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

బంగార్రాజు చిత్రం చేయాలనే కోరికతో నాగార్జున దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ట్రాక్‌ రికార్డును పట్టించుకోవడం లేదని, ఆయన సోగ్గాడే చిన్ని నాయన సినిమా తప్ప ఏ సినిమా కూడా ఆకట్టుకోలేదని, బంగార్రాజు చిత్రంతో ఆకట్టుకుంటాడని నాగార్జున ఎలా అనుకుంటున్నాడు అంటూ సినీ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. నాగార్జున సినిమాల ఎంపిక విషయంలో గుడ్డిగా వ్యవహరిస్తున్నాడు అని, ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల అభిమానులు ఆవేదన చెందుతున్నారు. నాగార్జున మంచి చిత్రాలను ఎంపిక చేసుకోవాలని సన్నిహితులు కూడా సలహా ఇస్తున్నారు.