నాగబాబుకే ఎందుకు ఇలా జరుగుతుంది?     2018-05-15   02:58:04  IST  Raghu V

అన్నయ్య చిరంజీవి ప్రోత్సాహంతో నాగబాబు నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించాడు. అయితే ఏ ఒక్క సినిమా కూడా ఆయనకు భారీ విజయాన్ని తెచ్చి పెట్టలేక పోయాయి. ముఖ్యంగా ‘ఆరంజ్‌’ చిత్రం నాగబాబును కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ చిత్రం వల్ల నాగబాబు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నాగబాబు కోసం పవన్‌ కళ్యాణ్‌ కూడా కొంత మొత్తంలో సాయం చేసినట్లుగా అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. ఆరెంజ్‌ దెబ్బ నుండి కోలుకోవడానికి నాగబాబుకు దాదాపు అయిదు సంవత్సరాలు పట్టింది. ఆ సినిమా మిగిల్చిన నష్టాల నుండి బయట పడ్డ నాగబాబుకు తాజాగా అల్లు అరవింద్‌ పిలిచి మరీ తన కొడుకు బన్నీతో సినిమా నిర్మించమంటూ ఆఫర్‌ ఇచ్చాడు.

అల్లు అర్జున్‌ డేట్లు ఇవ్వడంతో పెట్టుబడి పెద్దగా పెట్టకుండా, లగడపాటి శ్రీధర్‌తో కలిసి ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని నిర్మించాడు. తక్కువ పెట్టుబడితో ‘నా పేరు సూర్య’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన నాగబాబు ఈ చిత్రంతో అంతో ఇంతో వెనకేసుకోవచ్చు అని భావించాడు. కాని సీన్‌ రివర్స్‌ అయ్యింది. నా పేరు సూర్య చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని స్క్రీన్‌ప్లే మరియు కథ ప్రేక్షకులకు బోర్‌ కొట్టించింది. దాంతో సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ రాలేదు. దానికి తోడు మహానటి చిత్రం విడుదలతో నా పేరు సూర్య చిత్రం కలెక్షన్స్‌ పూర్తిగా డ్రాప్‌ అయ్యాయి.