చైతూను చూసి కాదు.. మారుతి వల్ల ఆ రేటు     2018-05-20   21:39:31  IST  Raghu V

ఈమద్య కాలంలో తెలుగు సినిమాలకు ఓవర్సీస్‌లో భారీ రేట్లు దక్కుతున్నాయి. కలెక్షన్స్‌ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఈమద్య విడుదలైన రంగస్థలం, భరత్‌ అనే నేను, మహానటి చిత్రాలు ఓవర్సీస్‌లో ఏ రేంజ్‌లో కలెక్షన్స్‌ను దక్కించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిత్రాలు కూడా ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్‌’ మరియు ‘మహానుభావుడు’ చిత్రాలు ఓవర్సీస్‌లో మిలియన్‌ మార్క్‌ను సునాయాసంగా క్రాస్‌ చేసింది. ఆ కారణంగానే తాజాగా ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం కూడా మంచి రేటుకు అమ్ముడు పోయింది.

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చైతూ కెరీర్‌లో విభిన్నమైన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచి పోతుందనే నమ్మకంను అక్కినేని ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. అత్తా, అల్లుడి మద్య సాగే వార్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టైటిల్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. కనుక ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్‌లో ఫ్యామిలీ ఓరియంటెడ్‌ చిత్రాలకు మంచి మార్కెట్‌ ఉంది. అందుకే దాదాపు మూడు కోట్లు పెట్టి ఈ చిత్ర రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.