కంగారులో కమలం పార్టీ ! దెబ్బేస్తున్న ఎన్నికల ఫలితాలు     2018-05-31   20:20:49  IST  Bhanu C

కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇక తమకు తిరుగే లేదు అనుకున్న ధీమా కొద్ది కొద్దిగా ఆవిరి అవుతోంది. మోదీ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు ఆ పార్టీ కొంప ముంచుతున్నాయి. మొన్న కర్ణాటకలో పార్టీ అధికారం లో కి వచ్చినట్టే వచ్చి అవకాశం కోల్పోయింది. ఆ ఘటన మరవకముందే .. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ చతికలపడిపోయింది. 11స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. ఒక స్థానం మాత్రం బీజేపీ గెలుచుకుంది. ఈ ఫలితాలు బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని చెబుతున్నాయి. విపక్షాలు కలిస్తే కమలం పార్టీకి ముచ్చెమటలే అని రుజువు అయ్యింది. పూర్తి మెజారిటీతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమలనాథులకు భవిష్యత్ లో ఆ పరిస్థితి ఉండదనే అర్థమవుతోంది. మోడీ ప్రభంజనం తగ్గిందనేందుకు ఈ ఫలితాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

ఉప ఎన్నికల ఫలితాలు చూసి బీజేపీ శ్రేణుల్లో ఆందోళన మొదలయ్యింది…

బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. 11అసెంబ్లీల్లో కేవలం ఒక స్థానాన్ని మాత్రమే సాధించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూడా అదే పరిస్థితి కనిపించింది. మూడు సిట్టింగ్‌ స్థానాల్లో ఒక్క స్థానం మాత్రమే నిలుపుకోగలిగింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ లో శివసేన అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. మహారాష్ట్ర భండారా గోండియాలో ఎన్సీపీ ఘనవిజయం సాధించింది.