Mister Movie Review

చిత్రం : మిస్టర్

బ్యానర్ : శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్, లియో ప్రొడక్షన్స్

దర్శకత్వం : శ్రీను వైట్ల

నిర్మాతలు : నల్లమలుపు బుజ్జి, ఠాగుర్ మధు

సంగీతం : మిక్కి జే మేయర్

విడుదల తేది : ఏప్రిల్ 14, 2017

నటీనటులు – వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబా పటేల్, మురళీశర్మ, నాజర్ తదితరులు

వరుస డిజాస్టర్లతో కుదేలై కూర్చున్నారు దర్శకుడు శ్రీనువైట్ల. ఆగడు, బ్రూస్ లీ ఫలితాలు అయన్ని అగ్రహీరోలకి దూరం చేసాయి. దాంతో ఓ హిట్ సినిమాతో మళ్ళీ తనని తాను నిరూపించుకునేందుకు వరుణ్ తేజ్ తో “మిస్టర్” అనే సినిమాతో మనముందుకు వచ్చారు. ఇన్నిరోజులు బకరా కామెడితో అవస్థలు పడ్డ వైట్ల, బకరా కామెడీలోంచి బకరా తీసేసి, కామెడి వదలకుండా మిస్టర్ తీసారు. మరి మిస్టర్ లో కామెడీ క్లిక్ అయ్యిందో లేదో రివ్యూలో చూడండి.

కథలోకి వెళితే :

చైయ్ (వరుణ్ తేజ్), తాతయ్య పిచ్చయ్యనాయుడు (నాజర్) ని అసహ్యించుకుంటూ సొంతూరికి దూరంగా స్పేయిన్ లో పెరుగుతాడు. చైయ్ కి ఓ తప్పిదం వలన పరిచయం అవుతుంది మీరా (హెబా పటేల్). చైయ్ మీరాతో ప్రేమలో పడతాడు. కాని మీరా సిద్ధార్థ్ అనే మరో అబ్బాయతో ప్రేమలో ఉంటుంది. తాతయ మీద కోపంతో ఇండియా వెళ్ళడానికి ఇష్టపడని చైయ్, మీరా ప్రేమ ప్రమాదంలో పడితే, ఆ సమస్య తీర్చడానికి ఇండియా వస్తాడు. ఇక్కడ తనకి చంద్రముఖి (లావణ్య త్రిపాఠి) పరిచయం అవుతుంది. అసలే మీరా ప్రేమను సఫలం చేసేందుకు పోరాటం చేస్తూ శతృవులని సంపాదించుకున్న చైయ్, చంద్రముఖితో పరిచయం వలన రజావర వంశ రాజుకి చిక్కి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. ఆ ప్రమాదం ఏమిటి ? అసలు చంద్రముఖి ఎవరు? చైయ్ మీరా, చంద్రముఖిలో ఎవరికి సొంతం అవుతాడు? తాతయ్య మీద ద్వేషం ఎందుకు పెంచుకున్నాడు? చివరకి తాత మనవలు ఒకటయ్యారా లేదా? ఈ విషయాన్ని తెరమీదే చూడాలి..

నటీనటులు నటన :

పచ్చిగా చెప్పాలంటే, వరుణ్ తేజ్ డ్యాన్సులు, కామెడీ చేయాలని, కమర్షియల్ హీరోగా నిలబడాలని ఈ సినిమా చేసుంటాడు. టార్గేట్ ప్రకారం వరుణ్ కామెడీ టైమింగ్ తో కొన్ని నవ్వులు పూయించాడు. రేపు ఏదైనా హాస్యరసం బాగా ఉన్న సినిమా చేయాల్సవస్తే వరుణ్ భయపడాల్సిన అవసరం లేదు. డ్యాన్సుల్లో తేలిపోయాడు. కంచె లాంటి సినిమాతో మంచి నటుడు అనిపించుకున్న వరుణ్ ఈ సినిమాలో పెద్దగా చేయగలిగింది ఏమి లేదు. హెబా ఎప్పటిలానే అదే రోటీన్ చలాకితనాన్ని చూపించింది. సెకండాఫ్ లో తన పాత్ర తీరుతెన్నులు మారినా, మాట్లాడడానికి ఏమి లేదు. లావణ్య కి కూడా ప్రతిభ చూపించడానికి పెద్దగా ఆస్కారం ఉన్న పాత్ర దొరకలేదు. ఓ పాటలో మాత్రం గ్లామర్ ఒలకబోసే ఛాన్స్ దొరికింది. నాజర్ పాత్ర అంతంతమాత్రమే. విలన్ పెద్ద మైనస్.

కామెడియన్స్ లో శ్రీనివాస్ రెడ్డి, రఘబాబు మాత్రమే నవ్వించగలిగారు. పెళ్ళిచూపులు ప్రయదర్శి టాలెంట్ ని వాడుకోలేకపోయారు. చివరికి పృథ్వీని కూడా వాడుకోలేకపోయారు.