Mega Hero’s Mega Movie Festival

మరో రెండు రోజుల తర్వాత మూడాలు రాబోతున్నాయి. ఆ సమయంలో శుభకార్యక్రమాలు ఏవీ కూడా జరిపేందుకు హిందూసాంప్రదాయాలు పాటించే వారు ఇష్టపడరు. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా కొన్ని లక్షల పెళ్లిలు జరుగుతున్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే వరుసగా సినిమాలను ప్రారంభిస్తున్నారు. ఉండి ఉండి మూడాల్లో ఎందుకు కొత్త సినిమాను ప్రారంభించాలని అనుకుంటున్నారో ఏమో కాని, పలు తెలుగు సినిమాలు ఈ రెండు మూడు రోజులుగా భారీగా ప్రారంభం అవుతున్నాయి.

మరో రెండు రోజల్లో ఒక్క తెలుగులోనే పదుల సంఖ్యలో సినిమాలు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మెగా ఫ్యామిలీకి చెందిన అయిదు సినిమాలు మూడు రోజుల గ్యాప్‌లో షురూ అవుతున్నాయి. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌ సినిమా ప్రారంభం అయ్యింది. ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ సినిమాను శరత్‌ మారార్‌ నిర్మించనున్నాడు. నేడు ఆ సినిమా పూజా కార్యక్రమాలు లాంచనంగా ప్రారంభం అయ్యాయి. ఇక చిరంజీవి 150వ సినిమాను ఈనెల 29న ప్రారంభించబోతున్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సినిమా ఇన్నాళ్లకు ప్రారంభం కాబోతుంది. ఇక మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, శ్రీనువైట్లల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాను సైతం రేపు ప్రారంభించనున్నారు. సాయిధరమ్‌ తేజ్‌, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు సైతం ఇప్పుడే పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక మరో మెగా హీరో అల్లు శిరీష్‌ కొత్త సినిమా కూడా ప్రారంభంకు సిద్దం అవుతోంది. ఇలా అయిదుగురు మెగా హీరోలు తమ సినిమాలతో టాలీవుడ్‌లో సందడి చేస్తున్నారు.