‘ఆర్‌’ మల్టీస్టారర్‌లోకి మహేష్‌ను లాగే ప్రయత్నం     2018-04-26   06:06:39  IST  Raghu V

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ వంటి బిగ్గెస్ట్‌ సూపర్‌ హిట్స్‌ తర్వాత తెరకెక్కబోతున్న చిత్రం అవ్వడంతో మల్టీస్టారర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ సినిమాల సంఖ్య చాలా తగ్గింది. ఒక వేళ వచ్చినా చిన్న చితకా మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చాయి. కాని టాలీవుడ్‌లో టాప్‌ హీరోల మల్టీస్టారర్‌లు మాత్రం రావడం ఇదే అవ్వడంతో ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ వంటి సూపర్‌ స్టార్‌ హీరోలు ఒక సినిమాలో కలిసి నటించడం, ఆ సినిమాకు టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించడం వంటి కారణాల వల్ల సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇంకా కథ కూడా ఫైనల్‌ కాని ఈ చిత్రం గురించి అప్పుడే వందల కోట్లు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్లతో నిర్మిస్తున్నాడు అని, రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల పారితోషికం ఏంకంగా 100 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే ఈ చిత్రంలో మహేష్‌బాబు కూడా నటిస్తాడు అనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, మహేష్‌బాబులు మంచి స్నేహితులు. ఈ ముగ్గురు కూడా ఇటీవల వరుసగా కలుస్తూ పార్టీలు గట్రా చేసుకుంటున్నారు. సినిమాలను పక్కన పెడితే మేము మంచి స్నేహితులం అంటూ ఈ ముగ్గురు కూడా పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు.