బాగా లేని మహేష్ మానసిక స్థితి .. చిక్కుల్లో కొరటాల శివ  

ఓ సినిమా ఫ్లాప్ అయితే మిగితా హీరోల మెదడ్లో ఎలాంటి ఆలోచనలు మొదలుతాయో తెలియదు కాని, మహేష్ బాబు మాత్రం నిరాశ – నిస్పృహలోకి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని ఎవరో చెబితే ఎందుకు నమ్ముతాం, స్వయంగా మహేష్ బాబే ఇప్పటికి ఓ ఇరవై ఇంటర్వ్యూలలో ఈ ముక్కని చెప్పినట్లున్నాడు. మహేష్ ఒక సినిమా ఫ్లాప్ అయితే కోలుకోవడానికి చాలా టైమ్ తీసుకుంటాడు. సైనికుడు, అతిథి పరాజయాల తరువాత మహేష్ మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు.

ఇక స్పైడర్ మహేష్ కెరీర్లో మామూలు దెబ్బ కాదు. 100 కోట్ల బడ్జెట్ పెట్టి, ఏదో హాలివుడ్ స్థాయి సినిమా తీస్తున్నట్లు బిల్డప్ కొట్టి, చివరకి ఒక మెడికోర్ సినిమాని ప్రేక్షకులపై రుద్దితే వారు మాత్రం ఎందుకు చూస్తారు? స్పైడర్ అంచనాల దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. బండకి బండ, 60-70 కోట్ల నష్టాలు తీసుకువచ్చేలా ఉంది ఈ సినిమా. ఆ నష్టాలతోనే, ఇదే మహేష్ బాబుతో మరో సినిమా సులువుగా తీసెయ్యొచ్చు. యావత్ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక నష్టాలు తీసుకొచ్చే సినిమాగా మారనుంది స్పైడర్. మరి ఇంత జరుగుతోంటే, మహేష్ డిప్రెషన్ లోకి వెళ్ళకుండా ఎలా ఉంటాడు?

ఈ డిప్రెషన్ ప్రభావం కొరటాల శివకు కష్టాలు తీసుకొచ్చేలా ఉంది‌. భరత్ అనే నేను కొత్త షెడ్యూల్ అక్టోబరు 6న మొదలవ్వాలి. అది వాయిదా పడుతోందని సమాచారం. కారణం, మహేష్ బాబు మానసిక స్థితి. గత 5 సినిమాల్లో 4 డిజస్టర్స్ వచ్చాయి కదా. అందులోనూ స్పైడర్ లెక్కలు వేరు కదా. మరి మహేష్ ఎన్నిరోజులు ఇలా డిప్రేషన్ లో ఉంటాడో, దాని వలన భరత్ అనే నేను ఇంకెంత ఆలస్యం అవుతుందో.