మహేష్‌ 25వ చిత్రం మారిందా?     2018-05-10   01:49:07  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజాగా ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌ బాబు 24వ చిత్రంగా వచ్చిన భరత్‌ టాలీవుడ్‌ రికార్డులను బ్రేక్‌ చేసి టాప్‌ చిత్రాల జాబితాలో స్థానం దక్కించుకుంది. అంతటి గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత మహేష్‌బాబు తన 25వ చిత్రంపై కాస్త ఎక్కువ ఫోకస్‌ పెట్టడం చాలా సహజం. దాదాపు ఆరు నెలల క్రితమే మహేష్‌బాబు 25వ చిత్రం ఖరారు అయ్యింది. దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు సంయుక్తంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌ 25వ సినిమాను నిర్మించబోతున్నారు. ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగి పోయాయి.

మహేష్‌ 25వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతుందని అంతా భావిస్తున్న సమయంలో షాకింగ్‌గా మహేష్‌బాబు తన 25వ సినిమాను మార్చుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి రూపొందించిన కథ ఒక హాలీవుడ్‌ సినిమాకు కాపీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిష్టాత్మక 25వ చిత్రానికి ఇలాంటి విమర్శలు రావడంతో మహేష్‌బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడు. రంగస్థలం విడుదలైన వెంటనే మహేష్‌బాబు, సుకుమార్‌ల కాంబో మూవీ ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.