‘మహానటి’ సక్సెస్‌ గ్యారెంటీ.. ఎందుకంటే!    2018-05-06   23:37:51  IST  Raghu V

తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం గుర్తుండే హీరోయిన్‌ సావిత్రి. తెలుగు వారికి ఎప్పుడు హీరోయిన్‌గానే కనిపించే సావిత్రి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పెళ్లి నుండి ఆమె చివరకు చనిపోయే వరకు చాలా పరిణామాలు జరిగాయి. అయితే కొన్నింటిపై స్పష్టత లేదు. సావిత్రి జీవితం గురించి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం వెదుకుతూ తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. మూడు సంవత్సరాల పాటు సావిత్రి జీవిత చరిత్రపై రీసెర్చ్‌ చేసి, ఒక అద్బుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేసి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.

తనకు సావిత్రిపై ఉన్న అభిమానంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాను అంటూ చెబుతున్న నాగ్‌ అశ్విన్‌ సినిమా విడుదల కాకుండానే సగం సక్సెస్‌ అయ్యాడు. ఏ పని అయినా పూర్తి దృష్టి పెట్టి, మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నానుడి ఉంది. అలాగే ఈ చిత్రంకు వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరు కూడా తమ పూర్తి దృష్టిని, శ్రద్దను పెట్టారు. అందుకే ఈ చిత్రం ఇంత అద్బుతంగా వచ్చింది. సెట్టింగ్స్‌ నుండి నటీనటుల మేకప్‌ వరకు అన్ని కూడా అద్బుతంగా సెట్‌ అయ్యాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ ఎంపిక తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని తాజాగా విడుదలైన పోస్టర్‌లు మరియు స్టిల్స్‌ చూస్తే వారే తమ ఆలోచన తప్పని ఒప్పుకుంటున్నారు.