రాజమౌళికి సాధ్యం కానిది సాధిస్తానంటున్న క్రిష్‌     2018-05-11   23:50:22  IST  Raghu V

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి సాధ్యం కాని, అసాధ్యం అయిన రికార్డులను జక్కన్న సాధించాడు. బాలీవుడ్‌ దర్శకులు సైతం జక్కన్నను చూసి ముక్కున వేలేసుకునేలా చేశాడు. అంతటి గొప్ప కీర్తిని రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంతో పొందిన విషయం తెల్సిందే. బాహుబలి చిత్రం బాలీవుడ్‌ చిత్రాలను సైతం తలదన్నేలా వసూళ్లు సాధించి హాలీవుడ్‌ సినిమాలకు సైతం పోటీగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి బాహుబలి సాధించలేని ఒక రికార్డును క్రిష్‌ సాధిస్తాను అంటూ నమ్మకంగా ఉన్నాడు. ఈ విషయాన్ని సన్నిహితులతో చెబుతున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం క్రిష్‌ బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌తో ‘మణికర్ణిక’ చిత్రంను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. జానపద చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను క్రిష్‌ ఎంతో కష్టపడి తెరకెక్కిస్తున్నాడు. క్రిష్‌ గత చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే మణికర్ణికకు దర్శకత్వం వహించే అవకాశం క్రిష్‌కు దక్కింది. కంగనా రనౌత్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి మరీ నటిస్తుంది. ఇది మరో బాహుబలి అంటూ కొందరు బాలీవుడ్‌ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి చిత్రంలో మాదిరిగా భారీ సెట్టింగ్‌లు మరియు యుద్ద సన్నివేశాలతో సినిమా నిండి ఉంటుందని అంటున్నారు.