సినిమాలను మించిన ట్విస్టులు.! ఒకరితో తాళి.. మరొకరితో ప్రేమపెళ్లి.. ఇంకో వ్యక్తితో జంప్.  

భర్తను మోసం చేసే భార్యలు ఒక ఎత్తు…భార్యలను మోసం చేసి మరొకరితో అక్రమసంబంధం పెట్టుకునే భర్తలు మరోవైపు. భారత సాంప్రదాయాలను మట్టిగలుపుతున్నారు సమాజంలోని ఆ కొందరు. ఒకరితో తాళి కట్టించుకుని అతడితో రెండు రోజులు గడిపి, ప్రేమించిన మరో వ్యక్తి చేయిపట్టుకొని అతడితో ఐదు దినాలు ఉండి, ఇంకొక వ్యక్తితో ఓ మహిళ జంప్‌ అయింది. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో జరిగింది. వివరాలలోకి వెళ్తే.

కోరాపుట్ జిల్లాకు చెందిన ఓ యువతికి పెద్దలు అదేప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి చేశారు. పెళ్లి చేసుకొని అత్తవారి ఇంటిలో అడుగుపెట్టి తాళికట్టిన భర్తతో రెండు రోజులు గడిపింది.తర్వాత తాను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసి అతడి వెంట మరో ఏడగులు వేసింది. ఇది కొరాపుట్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన రెండవ భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక యువకుని సైకిల్‌ ఎక్కి వెళ్లిపోయినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? అనేది తెలీలేదు. దీంతో అన్ని పోలీస్‌ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.