కీర్తి సురేష్‌ బిస్కెట్‌ వేసిందిగా!     2018-06-22   00:58:40  IST  Raghu V

‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కీర్తి సురేష్‌ ఆ తర్వాత చేసిన తెలుగు చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఆ సమయంలోనే అజ్ఞాతవాసి చిత్రంలో నటించింది. పవన్‌తో నటించిన అజ్ఞాతవాసి పెద్దగా ఆడకపోయినా కూడా కీర్తి సురేష్‌కు మాత్రం మంచి క్రేజ్‌ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కీర్తి సురేష్‌ ఆ సమయంలోనే మహానటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్‌ పోషించింది. సావిత్రి పాత్రకు జీవం పోసి, నిజంగా మహానటిని దించేసింది. ఇంతటి అద్బుతమైన నటనతో ఆకట్టుకున్న కీర్తి సురేష్‌కు తెలుగులో ఆఫర్లు రావడం లేదు.

తెలుగులో ప్రేక్షకులు కీర్తి సురేష్‌ను మహానటిగానే చూస్తున్నారు. ఈ సమయంలో కీర్తి సురేష్‌ గ్లామర్‌ రోల్స్‌తో ముందుకు వస్తాను అంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. కొంత కాలం వరకు కీర్తి సురేష్‌ను మహానటిగానే ప్రేక్షకులు ఊహించుకుంటూ ఉంటారు. అందుకే ఆమెను హీరోలు తమ సినిమాల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆ కారణంగానే ఈ అమ్మడు తెలుగు సినిమాకు ఇప్పటి వరకు కమిట్‌ కాలేదు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ చేతిలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా తెలుగు సినిమా లేదు. ఈ విషయంపై కీర్తి సురేష్‌ మరియు ఆమె సన్నిహితులు కాస్త విభిన్నంగా స్పందిస్తూ కవర్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు.