టీఆర్ఎస్- బీజేపీ బంధం అయోమయంగా ఉందే ...  

ఒకే పార్టీ కానీ రెండు వేరు వేరు విధానాలు అవలంబిస్తూ దోబూచులాట ఆడుతోంది. తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ ని మట్టికరిపించడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ అడుగులు వేస్తోంది. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అది కేవలం బీజేపీ వల్లే సాధ్యం అంటూ నాయకులూ ప్రచారం హోరెత్తిస్తూ తెలంగాణ అంత బస్సు యాత్రతో చుట్టేస్తున్నారు. కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతూ…రకరకాలైన పోస్టర్లను విడుదల చేస్తూ కాకా పుట్టిస్తోంది తెలంగాణ బీజేపీ. కానీ కేంద్ర బీజేపీ అగ్ర నాయకుల వద్ద మాత్రం సీన్ వేరేలా ఉంది.

కేసీఆర్ కి రెడ్ కార్పెట్ వేసి మరీ చంకనెక్కించుకుంటున్నారు మోదీ అండ్ కో బృందం. కెసిఆర్ అయన కుమారుడు కేటీఆర్ ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తూ…ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తాజాగా, రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది! కేసీఆర్ కి నితీష్ కుమార్ ఫోన్ చేశారు కాబట్టి, అందుకే జేడీయు అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కి తాము మద్దతు ఇచ్చారనే లెక్కల్లో టీఆరెఎస్ సమర్ధించుకుంటోంది. ఇలాంటి కోణాలు ఎన్నైనా తీసుకోవచ్చుగానీ. ఢిల్లీ స్థాయికి వచ్చేసరికి మోడీ వెర్సెస్ కేసీఆర్ అనే వాతావరణమైతే లేదన్నది చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది.

ఢిల్లీ పరిణామాలు అన్ని తెలంగాణ బీజేపీకి తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో మేము కేసీఆర్ పై పోరాట యాత్రలు చేస్తుంటే ఢిల్లీలో మాత్రం ఆయనకు సన్మానాలు చెయ్యడం ఏంటని అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇక్కడి నేతలు బస్సు యాత్రలు చేస్తూ, కేసీఆర్ కి వ్యతిరేకంగా రోజుకొక పోస్టర్లు విడుదల చేస్తూ. ఇలా తమకు ప్రత్యర్థి టీఆర్ఎస్ అనే రేంజిలో పోరాటాలు చేస్తున్నారు. అయితే, జాతీయ స్థాయికి వచ్చేసరికి.. రాష్ట్రంలో పార్టీ నేతల పోరాటాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. దీంతో తెలంగాణ బీజేపీలో అయోమయం నెలకొంది. అసలు మేము టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పోరాటం చెయ్యడం సరైనదేనా .. ఢిల్లీలో ఒకలా రాష్ట్రంలో ఒకలా ఉంటె ప్రజలు హేళన చేసే అవకాశం ఉంది కదా దీనివల్ల భారీగా నష్టపోయేది మేమే కదా అనే ఆలోచనలో ఇప్పుడు టి. బీజేపీ శాఖ ఉంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సూచనల మేరకే టీఆర్ఎస్ మీద పోరాటం చేస్తున్నామని రాష్ట్ర నాయకులూ చెప్పడం గమర్హం.