బాల‌య్య ఫ్యాన్స్‌పై క‌న్నేసిన వైసీపీ ఎమ్మెల్యే     2018-06-19   03:35:19  IST  Bhanu C

ఏపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా గెలిచి అధికారాన్ని ద‌క్కించుకునేందుకు వైసీపీ నేత‌లు జోరుగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇతర పార్టీ నేత‌లు, టీడీపీలో అసంతృప్తి నాయ‌కుల‌తో `ట‌చ్‌`లో ఉంటూ వారిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు చాప కింద నీరులా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయ‌కులపై పూర్తిగా దృష్టిసారించారు. అంతేగాక టీడీపీకి అండ‌గా ఉన్న అభిమాన సంఘాల‌నూ ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డారు.

ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీ న‌టుడు బాల‌కృష్ణ అభిమానుల మ‌ధ్య విభేదాల‌ను.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యే తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తు న్నార‌ట‌. ఇప్ప‌టికే తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అసంతృప్తుల‌కు గేలం వేసి విజ‌య‌వంతమైన ఆయ‌న.. ఇప్పుడు బాల‌య్య అభిమానుల‌పై క‌న్నేయ‌డం.. హాట్‌టాపిక్‌గా మారింది. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ బ‌లంగా ఉన్నా.. మ‌రికొన్ని ప్రాంతాల్లో టీడీపీ గ‌ట్టి ప‌ట్టు సాధించింది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం కొన్ని ప్రాంతాల్లో మ‌రింత ప‌టిష్టంగా ఉంది. ఆ పార్టీ బ‌లాన్ని త‌గ్గించేందుకు వైసీపీ నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదే స‌మ‌యంలో టీడీపీలో లుక‌లుక‌లు.. వైసీపీ నేత‌ల‌కు ప్ల‌స్ అవుతున్నాయి. అసంతృప్తితో రగులుతున్న నేత‌ల‌పై దృష్టిసారించేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను ప్రారంభించారు.