చివరగా హాస్పిటల్ లో కరుణానిధి గారు చూసిన సినిమా ఏదో తెలుసా.?  

ద్రవిడ సూరీడు, తమిళ ప్రజల ఆరాధ్య నేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో అధికార లాంఛనాలతో కళైంజర్ అంత్యక్రియలు బుధవారం (ఆగస్టు 8) రాత్రి ముగిశాయి. పుట్టింది ఒక సామాన్య కుటుంబంలో అయినా కరుణానిధి ఎదిగిన తీరు అద్భుతం, అపూర్వం. కరుణకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ‘దక్షిణామూర్తి’. తన పద్నాలవయేటే దక్షిణామూర్తిలో విప్లవ భావాలు వెలుగు చూశాయి. ఆ భావాలే ఆయనను పేరును మార్చాయి. తల్లిదండ్రులు పెట్టిన పేరును సైతం మార్చేసుకుని ‘కరుణానిధి’ అయ్యారు

ఇది ఇలా ఉండగా…కలైంజర్‌ కరుణానిధికి సినిమా అంటే మహా ఇష్టం. భారత ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఏ నటుడు కూడా చివరి వరకు సినిమాల్లో కొనసాగిన దాఖలాలు లేవు. కానీ, కరుణానిధి తన రాజకీయ జీవితానికి కారణమైన సినిమాని కడవరకూ వదల్లేదు. ప్రధానంగా సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోజుల్లోనూ ఆయన సినిమాకి దగ్గరగానే ఉన్నారు. 2011లో సీఎంగా పనిచేసిన ఆఖరి రోజు వరకు సినిమాతో ఆయన బంధం కొనసాగింది. 2011లో ప్రశాంత్‌ హీరోగా వచ్చిన ‘పొన్నార్‌ శంకర్‌’ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే అందించింది కలైంజరే. ఆయనకి ఇష్టమైన రచనల్లో ఇదీ ఒకటి. అదే ఏడాది సురేష్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇలైంజన్‌’ చిత్రానికి కూడా కరుణానిధి కథ అందించారు. ఆ రెండు చిత్రాల ఆడియో వేడుకలకు కూడా హాజరయ్యారు. సీఎంగా ఎంత బిజీగా వున్నా సినిమా కార్యక్రమాలకు తప్పకుండా హాజరయ్యేవారు. చివరికి కావేరీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా రజనీకాంత్‌ నటించిన ‘బాషా’ చిత్రం వీక్షించారంటే ఆయనకి సినిమాలంటే ఎంత మక్కువో అర్ధం చేసుకోవచ్చు.

సేలంలోని మోడ్రన్‌ థియేటర్స్‌ స్టూడియోస్‌ అధినేత టీఆర్‌ సుందరం యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుండేవారు. కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత ప్రతిభను అందరికంటే ముందుగా గుర్తించింది ఆయనే అని చెబుతారు. కరుణానిధి ఎప్పుడు సేలం వెళ్లినా మోడ్రన్‌ థియేటర్‌ని తప్పక తిలకించేవారు. ప్రస్తుతం అది పెద్ద బంగ్లాగా మారిపోయింది. 20వ యేట జూపిటర్‌ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థలో స్ర్కిప్ట్ రైటర్‌గా చేరారు. తొలి చిత్రం ‘రాజకుమారి’తోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన సినీ ప్రస్థానంలో 75 పైగా చిత్రాలకు స్ర్కీన్‌ప్లే రాశారు. అదే విధంగా పలు చిత్రాలకు మాటలు, పాటలు కూడా అందించారు.