ఏపీలో బీజేపీ నిద్ర లేచిందా.... ఇట్స్ టూ లేట్‌..!     2018-06-13   01:19:09  IST  Bhanu C

ఏపీలో త్రిముఖ వ్యూహం అమ‌లు చేసే దిశ‌గా బీజేపీ అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని టార్గెట్ చేస్తూ అధికారంలోకి రావ‌డ‌మే ధ్యేయంగా పావులు క‌దుపుతోంది. ఏమిటా త్రిముఖ వ్యూహం అంటే.. ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం, టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డం, ఇత‌ర పార్టీల నుంచి వల‌స‌ల‌ను ప్రోత్స‌హించ‌డం. ఇందులో భాగంగానే మొన్న విజ‌య‌వాడ‌లో బీజేపీ నేత‌లు మ‌హాధర్నా నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ త‌న‌దైన ముద్ర‌వేసుకోవ‌డానికి ప్ర‌యత్నం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ప‌లువురు టీడీపీ నేత‌లు ప్ర‌ధాని మోడీపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాత టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా మ‌హాధ‌ర్నా చేప‌ట్టారు. అయితే.. క‌న్నా కార్యాచ‌ర‌ణ‌లోనూ క‌న్నాలు ఉన్నాయ‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఇదంత కూడా పార్టీ ప్ర‌యోజ‌నాల‌కు కాకుండా.. మోడీ వ‌ద్ద మార్కులు కొట్టేయ‌డానికే క‌న్నా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఢిల్లీకి వెళ్లి మ‌ర్యాద‌పూర్వ‌కంగా ప్ర‌ధాని మోడీని, ఇత‌ర నేత‌ల‌ను క‌లిసేముందు.. క‌న్నా ఇలాంటి ట్రిక్స్ ఉప‌యోగించిన‌ట్లు ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు.