విశ్వరూపం 2 పై ఊహాగాణాలకు క్లారిటీ ఇచ్చిన కమల్‌  

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిన ‘విశ్వరూపం 2’ చిత్రం దాదాపు ఆరు సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత విడుదలకు సిద్దం అయిన విషయం తెల్సిందే. విశ్వరూపం విడుదలై ఆరు సంవత్సరాలు అయ్యింది. ఆ చిత్రం విడుదలైన ఆరు నెలల్లోనే విశ్వరూపం 2 చిత్రాన్ని విడుదల చేయాలని భావించిన కమల్‌ హాసన్‌కు కాలం కలిసి రాలేదు. విశ్వరూపం 2 చిత్ర నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోవడంతో సినిమా పూర్తి చేయడం ఆయనకు సాధ్యం కాలేదు.

అప్పుడప్పుడు ఆ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తూ, తానే అన్ని చూసుకుంటూ, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి సినిమాను గట్టెక్కించి విశ్వరూపం 2ను కమల్‌ విడుదల చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈనెల 10న విడుదల చేయాలని డేట్‌ను కూడా ఫిక్స్‌ చేయడం జరిగింది. కాని సినిమా అనుకున్న రీతిలో విడుదల కావడం లేదని, కరుణానిధి మరణంతో సినిమాను వాయిదా వేయాలని కమల్‌ నిర్ణయించుకున్నాడు అంటూ తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి.

తమిళ మీడియాలో వచ్చిన వార్తలపై కమల్‌ హాసన్‌ స్పందించాడు. విశ్వరూపం 2 విడుదల వాయిదా వేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్న వారికి అమౌంట్‌ తిరిగి ఇస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని, అది సాధ్యం కాదు అంటూ కమల్‌ చెప్పుకొచ్చాడు. ముందుగా అనుకున్న ప్రకారం విశ్వరూపం 2ను విడుదల చేస్తాం అని, కరుణానిధి మరణం తీరని లోటు, ఆయన మరణం తీవ్రంగా కలచి వేసిందని చెప్పిన కమల్‌ హాసన్‌, విశ్వరూపం 2 చిత్రం మాత్రం విడుదల అయ్యి తీరుతుందని నమ్మకంగా చెప్పాడు.

కమల్‌ ప్రకటన తర్వాత మళ్లీ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ జోరందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈచిత్రం భారీగానే విడుదలకు సిద్దం అయ్యింది. కమల్‌ హాసన్‌ నట విశ్వరూపం ఈ చిత్రంలో చూడవచ్చు అని ట్రైలర్‌ చూస్తేనే అర్థం అయ్యింది. తన బిరుదుకు తగ్గట్లుగానే ఈ చిత్రంలో కమల్‌ నటించాడు అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.