ఎన్నిక‌ల వేళ‌.. బాబు చుట్టూ బీసీల గోల‌..!     2018-04-23   23:48:04  IST  Bhanu C

మ‌రో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. తిరిగి అధికారం కైవ‌సం చేసుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర బాబు ద్రుఢంగా నిర్ణ‌యించుకున్నారు. దీనికిగాను ఆయ‌న అన్ని సామాజిక వ‌ర్గాల‌ను త‌న వైపు తిప్పుకొన్నారు. ముఖ్యంగా బీసీ వ‌ర్గాలే త‌న‌కు ప్రాణ‌మ‌ని, వారివ‌ల్లే త‌న రాజ‌కీయ యాత్ర సాగుతోంద‌ని బాబు ప‌దే ప‌దే చెప్పుకొస్తు న్నారు. బీసీల‌కు వ‌రాల మీద వ‌రాలుకుమ్మ‌రిస్తున్నారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్ర‌బాబు వ‌ర‌కు టీడీపీలో బీసీల‌కు ఎంతో ప్ర‌యారిటీ ఉంటుంది. చంద్ర‌బాబు ఓ డిప్యూటీ సీఎం ప‌ద‌విని బీసీ వ‌ర్గాల‌కు చెందిన కేఈ.కృష్ణ‌మూర్తికి కూడా ఇచ్చారు.

మ‌రి ఇంత‌లా బీసీల ప‌ట్ల ప్రేమ కురిపిస్తున్న బాబుకు అదే బీసీ వ‌ర్గం నుంచి సెగ త‌గులుతోంది. బీసీల‌కు వ్య‌తిరేకంగా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటూ.. ఫిర్యాదులు వెల్లువె త్తుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఓ గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. విష‌యంలోకి వెళ్తే.. సీఎం చంద్రబాబు బీసీలను అణగదొక్కుతున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేయ‌డం ఇప్పుడు బీసీ వ‌ర్గాల‌తో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. చంద్రబాబు పాలనలో ఆయన కులానికి చెందిన వారికి మాత్రమే న్యాయం జరుగుతోందని మండిపడ్డారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో బాబు వ్యవహరించిన తీరు బీసీలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు.