త్రివిక్రమ్‌ రేంజ్‌ ఏమాత్రం తగ్గలేదు     2018-06-28   23:39:04  IST  Raghu V

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. పవన్‌ 25వ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకం అంటూ త్రివిక్రమ్‌ అతి జాగ్రత్తలు తీసుకోవడం కారణమో లేదంటే మరేంటో కాని అజ్ఞాతవాసి చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో ఆ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది. ఆ చిత్రం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్దం అవుతుంది.

ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిర్రతంను దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై అజ్ఞాతవాసి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. అయితే త్రివిక్రమ్‌ క్రేజ్‌ ఒక్క సినిమాతో పోయేది కాదని, ఆయన క్రేజ్‌ శిఖరం అంత ఎత్తు అంటూ తాజాగా నమోదు అవుతున్న లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. ప్రస్తుతం చేస్తున్న చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి ఏకంగా 75 కోట్లకు పైగా బిజినెస్‌ను నమోదు చేయడం జరిగింది.